
ప్రజాశక్తి - భట్టిప్రోలు
ప్రపంచ స్థాయిలో అందించే గ్లోబల్ టీచర్ ప్రైజ్‌కు ఎంపికైన 50 మందిలో ఉన్న ఐలవరం ఆంగ్ల ఉపాధ్యాయులు పచార హరికృష్ణను మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ డివి లలితకుమారి, జడ్పిటిసి తిరువీధుల ఉదయ భాస్కర్ మాట్లాడుతూ పచ్చారు హరికృష్ణ ఇప్పుడున్న 50మంది నుండి ఒకరిగా ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. అంతేకాక దేశంలోనే ఎంపికైన ఆరుగురిలో ఆంధ్ర నుండి హరికృష్ణ ఒకరే ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో హరికృష్ణ తన ఆంగ్ల బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని అన్నారు. మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కౌతరకు పిచ్చయ్య శాస్త్రి, ఎంపీడీవో గుమ్మా చంద్రశేఖర్, ఏవో శైలజ, తహశీల్దారు వెంకటేశ్వరరావు, నాయకులు బాలాజీ, మల్లేశ్వరరావు ఉన్నారు.