
ప్రజాశక్తి-రాజాం, రేగిడి, బాడంగి : రాజాం మండలం ఒమ్మి-కొత్తపేట సమీపంలో శనివారం ఉదయం ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ (48) దారుణహత్యకు గురయ్యాడు. ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళ్తుండగా సినీ ఫక్కీలో బొలెరో వాహనంతో ఢకొీట్టి, ఆ తరువాత రాడ్లతో కొట్టి దుండగులు హత్య చేశారు. స్థానికులు చూసి కేకలు వేయడంతో బొలేరో వాహనంలో వచ్చిన వారు పరారయ్యారు. సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం..
తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన ఏగిరెడ్డి కృష్ణ అదే మండలంలోని కాలంరాజుపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య రాజాంలోని సామాజిక ఆస్పత్రిలో హెచ్‌డిగా పనిచేస్తుండడంతో పట్టణంలోని ఈశ్వర నారాయణ కాలనీలో నివాసం ఉంటున్నారు. కృష్ణ రోజూ రాజాం నుంచి పాఠశాలకు బైక్‌పై వెళ్లి వస్తుంటారు. స్వస్థలమైన ఉద్దవోలుకు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్లి వస్తుంటారు. గ్రామ స్థాయి రాజకీయాల్లో ఆయన పరోక్ష పాత్ర పోషిస్తున్నారు. ఆయన మద్దతిచ్చిన వారే సర్పంచ్‌గా ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను రాజకీయంగా విబేధించిన వారే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చునని కుటుంబ భ్యులు ఆరోపిస్తున్నారు.
శనివారం ఉదయం పాఠశాలకు బయలుదేరిన కృష్ణమూర్తిని ఒమ్మి-కొత్తపేట సమీపంలో వెనుక నుంచి వచ్చిన బొలేరో వాహనం ఢకొీంది. దీంతో ద్విచక్ర వాహనంతో పాటు రోడ్డుపై పడిపోయిన కృష్ణమూర్తిని బొలేరో వాహనం కొంత దూరం ఈడ్చుకుని వెళ్లిపోయింది. కృష్ణ తీవ్రగాయాలైన ఆయన ఇంకా బతికే ఉన్నాడని గమనించిన దుండగులు రాడ్‌లతో అతన్ని కొట్టి హత మార్చారు. స్థానికంగా ఉన్న కొందరు చూసి కేకలు వేయడంతో నిందితులు పరారయ్యారు.స్థానికులు రాజాం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు సమాచారం అందడంతో వారు కూడా అక్కడికి చేరుకున్నారు. ఉద్దవోలు గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహతులు, ఉపాధ్యాయులు అక్కడికి చేరుకొని కృష్ణ మృతదేహంతో సాలూరు రోడ్డులో బైఠాయించి ఆందోళనకు దిగారు. హత్యకు పాల్పడిన నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. సుమారు నాలుగు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం తెలుసుకున్న చీపురుపల్లి డిఎస్‌పి శ్రీనివాస్ చక్రవర్తి, రాజాం సిఐ రవికుమార్ అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడారు. ఇదే సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన్నప్పలనాయుడు అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని డిఎస్‌పి తెలపడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










