Nov 15,2023 21:45

నివేదిక వివరిస్తున్న ఉపాధి హామీ సిబ్బంది

ప్రజాశక్తి-తెర్లాం :  1998 డిఎస్‌సి ద్వారా ఇటీవల ఉద్యోగం పొందిన ఉపాధ్యాయుడు వికలాంగ పెన్షన్‌ పొందుతున్నట్లు సామాజిక తనిఖీలో వెల్లడైంది. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో జరిగిన సామాజిక తనిఖీ ప్రజా వేదిక ఇన్‌ఛార్జి ఎంపిడిఒ నీలిమ ఆధ్వర్యంలో జరిగింది. ప్రజా వేదికలో చేపట్టిన ఆడిట్‌ నివేదికను ఎస్‌ ఆర్‌ పి అచ్యుత రావు చదివి వినిపించారు. మండలంలో1168 పనులు కు గాను 16 కోట్ల 79 లక్షల 5 వేల 367 రూపాయలు పనులకు ఆడిట్‌ జరిగిందని ఆయన తెలిపారు. నందబలగ గ్రామానికి చెందిన పెదిరెడ్ల రామారావు ఇటీవల 98 డిఎస్‌సి ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారని, అయితే ఆయన వికలాంగుడు కావడంతో పింఛను అందుతోందని తెలిపారు. ఆయనకు ఉద్యోగం వచ్చినా ఇంకా పెన్షన్‌ కొనసాగుతున్నట్లు ఇటీవల జరిగిన ఉపాధి పనులు తనిఖీలలో వెల్లడైనట్లు తెలిపారు. సామాజిక తనిఖీలలో గంగన్నపాడు, నందబలగలో మస్తర్లలో వేలిముద్రలు లేకుండా పేమెంట్‌ ఇవ్వకూడదని, రెవెన్యూ ప్లాంటేషన్‌ లో మొక్కలు లేకుండా బిల్లులు చెల్లించారని గుర్తించారు. కార్యక్రమంలో ఎపిడి శారదా దేవి, అంబుల్డ్‌ మాన్‌ అన్నపూర్ణమ్మ, ఎపిఒ కె.సుశీల, ఎస్‌ఆర్‌పి అచ్యుత రావు, డిఆర్‌పిలు, సంబంధిత అధికారులు పిఆర్‌ ఎఇ రాజశేఖర్‌ పాల్గొన్నారు.