Apr 29,2023 00:49
లూకయ్య మృతదేహానికి నివాళి అర్పిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-చీరాల: ఉపాధ్యాయ రంగంలో ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి వారిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు, యూటీఫ్‌ జిల్లా మాజీ కార్యదర్శి పంది లూకయ్య(78) శుక్రవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మృతి చెందారు.
లూకయ్య 1974లో చీరాల మునిసిపాలిటీలో ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభం నుంచి రిటైర్మెంట్‌ నాటి వరకు యూటీఫ్‌ ఫౌండర్‌గా, సభ్యుడిగా నాయకుడిగా వివిధ క్యాడర్లలో పనిచేశారు. యూటీఫ్‌లో కొనసాగుతూనే జన విజ్ఞాన వేదికలో 1988 నుంచి చీరాల ప్రాతంలో వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. 1998 కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం వ్యవస్థాపకుడుగా, 2002 నుంచి గుర్రం జాషువా సాహితీ సమితి వ్యవస్థాపకుడిగా, మధ్యతరగతి ఉద్యోగులతో, ప్రోగ్రెసివ్‌ స్టడీ సర్కిల్‌ నిర్వహణలో, కార్మిక పోరాటాలకు సహకారిగా సీపీఎం పార్టీలో సభ్యుడిగా సుదీర్ఘ కాలంపాటు తన యావత్‌ జీవితం ప్రజా ఉద్యమాలకు అంకితం చేశారు. లూకయ్య పార్థివ దేహానికి సీపీఎం చీరాల కమిటీ కార్యదర్శి ఎన్‌ బాబురావు, ఎం వసంతరావు సీనియర్‌ నాయకులు పి కొండయ్య, కెవిపిఎస్‌ నాయకులు ఎల్‌ జయరాజు, జెవివి నాయకులు కె రామారావు, డి నారపరెడ్డి, సీఐటీయూ నాయకులు డి నాగేశ్వరరావు, యూటీఫ్‌ నాయకులు బండి భిక్షాలు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు డి రమాదేవి, రాష్ట్ర నాయకులు జాలా అంజయ్య, పునాటి ఆంజనేయులు, కె ఉమామహేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జి గంగయ్య, సీఐటీయూ నాయకులు చీకటి, శ్రీనివాసరావు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ అనిల్‌ తదితరులు సంతాపం ప్రకటించారు.
- వీల్‌ చైర్‌లో వచ్చి.. ఎమ్మెల్సీ ఓటు వేసి..
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో లూకయ్య తీవ్ర అనారోగ్యంలోనూ తన ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిపిఎం నాయకుల సహాయంతో పోలింగ్‌ కేంద్రానికి వీల్‌ చైర్‌లో వచ్చారు. ఆయన చివరిసారిగా తన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లూకయ్య మృతితో అటు కుటుంబ సభ్యులలోనూ, ఇటు ఉపాధ్యాయులలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.