Aug 10,2023 21:38

యుటిఎఫ్‌ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న రవీంద్ర

* స్వర్ణోత్సవ వేడుకల్లో రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: 
ఉపాధ్యాయ ఉద్యమాలకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) దిక్సూచి అని ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర అన్నీరు. యుటిఎఫ్‌ ఆవిర్భవించి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా నగరంలోని యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో ఆవిర్భావ సభను గురువారం నిర్వహించారు. తొలుత యుటిఎఫ్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. చెన్నుపాటి లక్ష్మయ్య, దాచూరి రామిరెడ్డి, కడలి గంగిశెట్టి, సుబ్బరాజు, సూర్యనారాయణ, అప్పారి వెంకటస్వామి, నాగటి నారాయణకు జోహార్లు అర్పించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహతో యుటిఎఫ్‌ పనిచేస్తోందన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాడుతూ మేటి సంఘంగా నిలిచిందన్నారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అప్పారావు ఎస్‌.కిషోర్‌ కుమార్‌, సీనియర్‌ నాయకులు గొంటి గిరిధర్‌, ఎం.వాగ్దేవి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం, సంక్షేమం, విద్యాభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1974 ఆగస్టు పదో తేదీన యుటిఎఫ్‌ ఆవిర్భవించిందని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం పోరాటాలు చేపట్టి విజయాలు సాధించిందని గుర్తుచేశారు. జాతీయస్థాయిలోనూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం, విద్యారంగ అభివృద్ధికి ఎస్‌టిఎఫ్‌ఐ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిందన్నారు. సమస్యలపై ఉద్యమిస్తున్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులను అక్రమ అరెస్టులు, కేసులు నమోదు చేస్తూ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందన్నారు. ఇటువంటి పరిస్థితులను సైతం ఎదుర్కొని ఉద్యమాన్ని ముందువరుసలో ఉంచుతూ యుటిఎఫ్‌ పయనిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు హెచ్‌.అన్నాజీరావు, జి.సురేష్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై.ఉమాశంకర్‌, జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ బి.రవికుమార్‌, నాయకులు పి.బాబూరావు, కె.వెంకటరావు, డి.రాము, జి.చిన్నారావు, ఎల్‌.కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు.