Oct 30,2022 21:36

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
             ఏలూరు నగరపాలక సంస్థ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ అన్నారు. ఎపి యుటిఎఫ్‌ నగర శాఖ ఆధ్వర్యంలో నేతలు ఆదివారం ఆయనను కలుసుకుని వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నగరశాఖ ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.జక్రియా మాట్లాడుతూ ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉన్న ఎస్‌జిటి పోస్టులకు వర్గోన్నతి కల్పించాలని కోరారు. స్థానిక మౌలానా అబుల్‌కలాం పాఠశాలలో ఉర్దూ బోధించేందుకు ఉర్డూ గ్రేడ్‌-1 పండితుడిని నియమించాలని, ఇక్కడ ఉర్దూ బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని వాపోయారు. జిల్లాలో ఉన్న ఏకైక ఉర్దూ పాఠశాల ఇదేనని తెలిపారు. పోస్టు భర్తీ అయ్యే వరకూ తాత్కాలిక పద్ధతిలోనైనా ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. ప్రధానోపాధ్యాయులకు డిడిఒ పవర్స్‌ వచ్చేవరకూ నగరపాలక సంస్థ కమిషనర్‌ ద్వారానే జీతాలతోపాటు సరెండర్‌ లీవులు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, ఎఎఎస్‌ వచ్చే ఇంక్రిమెంట్లు, వార్షిక ఇంక్రిమెంట్లు ఇతర ఆర్థిక పరమైన వాటిని మంజూరు చేసేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మున్సిపల్‌ కోకన్వీనర్‌ ఈడే శివశంకరరావు, ఉపాధ్యక్షులు పర్వీన్‌బేగం, ఎస్‌ఎంసి ఛైర్మన్‌ యాసిన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎస్‌డి.సాహేరా పాల్గొన్నారు.