Sep 22,2023 21:21

యుటిఎఫ్‌ జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌, నాయకులు

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : ఉపాధ్యాయుల సమస్యలపై యుటిఎఫ్‌ అలుపెరుగని పోరాటం సాగిస్తోందని యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ వెల్లడించారు. యుటిఎఫ్‌ చేపట్టిన స్వర్ణోత్సవ ప్రచారయాత్ర శుక్రవారం విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. బొబ్బిలి, గజపతినగరం మీదుగా విజయనగరం చేరుకుంది. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో యుటిఎఫ్‌ జెండాను నాయకులు ఆవిష్కరించారు. ఎక్కడికక్కడ యాత్రకు యుటిఎఫ్‌ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ప్రసాద్‌ మాట్లాడారు. 49 ఏళ్ల కాలంలో విద్యారంగ వికాసం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం యుటిఎఫ్‌ ఎన్నో ఐక్య ఉద్యమాలను చేపట్టిందన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో అగ్రభాగాన ఉండటమే కాకుండా, ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా వారికి ఆర్థిక, హార్థిక సహాయం అందించిన ఏకైన సంఘం యుటిఎఫ్‌ అన్నారు. విద్యార్థుల హక్కులు, చదువు, పాఠశాల మూసివేత లాంటి ప్రతి అంశంలోనూ చొరవతీసుకుని పనిచేసిందన్నారు. ప్రస్తుతం జాతీయ నూతన విద్యా విధానం రద్దు, పాత పింఛను సాధన, రాష్ట్రంలో విద్యారంగ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తోందని తెలిపారు. వీటన్నిటిని పునశ్చరణ చేసుకునేందుకు, భవిష్యత్తు పోరాట కార్యాచరణను రూపొందించేందుకు స్వర్ణోత్సవాల సభ వేదిక కానుందని తెలిపారు. అక్టోబరు ఒకటో తేదిన విజయవాడలోని సిద్ధార్థ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు రెడ్డి మోహనరావు, లకీëరాజా, రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి, డి.రాము, జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శి రమేష్‌చంద్ర పట్నాయక్‌, జెఎవిఆర్‌కె ఈశ్వరరావు, జిల్లా నాయకులు వి.ప్రసన్నకుమార్‌, శ్రీనివాసరావు, కిలాడ అప్పారావు, తిరుపతి నాయుడు, కేశవరావు, వాసు, తదితరులు పాల్గొన్నారు.