Mar 13,2023 20:35

ఆళ్లగడ్డలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ సరళిని పరిశీలిస్తున్న ఎస్‌పి

ఉపాధ్యాయ, పట్టభద్రుల
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతం
జిల్లా ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      నంద్యాల జిల్లాలో సోమవారం జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి తెలిపారు. సోమవారం నంద్యాల పట్టణంలో ఎస్‌పి పర్యటించారు. పోలింగ్‌ కేంద్రాలను స్వయంగా సందర్శించి ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా క్యూలైనులు, పార్కింగ్‌ ప్రదేశాలు, ఎన్నికలు జరుగు తీరును, భద్రత చర్యలను పర్యవేక్షించి అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికలు నియమ నిబంధనల ప్రకారం విధులు కొనసాగాలని, ఓటర్లు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాలలో అదనపు బలగాలను మోహరించారు. ఎన్నికల సిబ్బంది పోలైన బ్యాలెట్‌ బాక్స్‌లను స్ట్రాంగ్‌ రూమ్‌ వద్దకు బస్సులలో తరలింపు సమయంలో రూట్‌ మొబైల్‌ పార్టీ సిబ్బంది ఆయా బస్సులకు రక్షణగా ఉంటూ సురక్షితంగా చేర్చాలని తెలియజేశారు. జిల్లాలో 61 పట్టభద్రుల పోలింగ్‌ కేంద్రాలు, 30 ఉపాధ్యాయుల పోలింగ్‌ కేంద్రాలు, 3 స్థానిక సంస్థలకు సంబంధించిన పోలింగ్‌ కేంద్రాలలో ఎలాంటి సంఘటనలు జరగలేదని, ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. ఈ పోలింగ్‌కు పోలీసు డిపార్ట్మెంట్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఎస్‌పి
ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలను జిల్లా ఎస్‌పి రఘువీర్‌ రెడ్డి సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను, పోలింగ్‌ సరళిని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా శాంతిభద్రతలను సంరక్షించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం విధులు కొనసాగాలని పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ డిఎస్పి సుధాకర్‌ రెడ్డి, నంద్యాల స్పెషల్‌ బ్రాంచ్‌ సిఐ దస్తగిరి బాబు, సిఐ పులిశేఖర్‌, ఆళ్లగడ్డ పట్టణ సిఐ జీవన్‌ గంగనాథ్‌ బాబు, ఎస్సైలు తిమ్మయ్య, వెంకటరెడ్డిలు పాల్గొన్నారు. అలాగే దొర్నిపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వద్ద గల పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ రఘువీర్‌ రెడ్డి పరిశీలించారు. పోలీసులు తమకు నిర్దేశించిన బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.