ప్రజాశక్తి - ఏలూరు టౌన్
వేసవి సెలవులు పూర్తయ్యేలోపు ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని యుటిఎఫ్ ఆక్షేపించింది. తరగతులు ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ బదిలీలు చేపట్టకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఏలూరు యుటియఫ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఆర్.రవికుమార్ అధ్యక్షతన ఆదివారం జరిగిన జిల్లావిస్తృత కార్యవర్గ సమావేశంలో యుటియఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడారు మంత్రి, అధికారులు షెడ్యూల్ ప్రకటిస్తామని ప్రెస్ నోట్లు ఇచ్చి ఎందుకు షెడ్యూల్ ప్రకటించలేదో వాస్తవ కారణాలు తెలియజేయాలని కోరారు. 3, 4, 5 తరగతుల విలీనం వల్ల రేషనలైజేషన్, ప్రమోషన్స్ నిర్వహించాల్సి ఉందని లేకపోతే, ఉపాధ్యాయుల కొరత ఏర్పడి విద్యకు విఘాతం ఏర్పడుతుందని విమర్శించారు. ప్రభుత్వ చర్యల వల్ల ఈ విద్యాసంవత్సరం అస్తవ్యస్తంగా మారిపోయిందని రోజుకో ప్రకటచేస్తూ ఉపాధ్యాయులను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. 3, 4, 5 తరగతుల విలీనం వల్ల నాణ్యమైన విద్య అందుతుందని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం.. హైస్కూళ్లలో ఈ తరగతులకు ఎలాంటి విద్య అందుతుందో విశ్లేషణ చేయకపోవడం చూస్తే విలీనం వల్ల ఏం సాధించాలనుకుంటుందో అర్ధం చేసుకోవాలని వివరించారు.
ఉభయ గోదావరి జిల్లాల ఎంఎల్‌సి షేక్ సాబ్జీ మాట్లాడుతూ 12 వేల ఏకోపాధ్యాయ పాఠశాలల వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందో ప్రభుత్వం చెప్పాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయకుండా తాత్సారం చేయడం వల్ల ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మునిసిపల్ ఉపాధ్యాయులకు డిడిఒ పవర్స్ వారి సెలవులు, ఇంక్రిమెంట్స్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని విమర్శించారు. రేపు,మాపు అని ఊదరగొడుతూ వాయిదా వేయడం తగదని, జిపిఎస్ అమలు కాకుండా ఒపిఎస్ అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉన్న పిఎఫ్, ఎపిజిఎల్‌ఐ, సరెండర్ లీవులను వెంటనే ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పివి.నరసింహారావు, గౌరవాధ్యక్షులు ఎంవి.శ్యాంబాబు, సహాధ్యక్షులు బి.సుభాషిణి, కోశాధికారి షేక్ ముస్తఫా అలీ, కార్యదర్శులు బి.వీరకోటి, బివి.రవీంద్ర, ఎన్.రాంబాబు, ఎస్.సుధారాణి, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం.బేతాళరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వి.కనకదుర్గ, విబివిఎస్.సుబ్రహ్మణ్యం, జిల్లా సిపిఎస్ కన్వీనర్ కె.కమల్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు గాంగేయుడు, దేవానంద్, స్వర్ణరేఖ, జిల్లాలోని మండల, పట్టణ శాఖల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.










