
దుష్ప్రచారం చేస్తూ మోడీసర్కార్ నిధుల కోత
పనిదినాలు, వేతనపెంపుపై పోరాటం తప్పదు
ఉపాధి హామీ చట్టం రాష్ట్ర సదస్సులో వక్తలు
ముఖ్య అతిధులుగా వ్యకాస జాతీయనేత, ఎంపీ శివదాసన్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి, అర్భన్
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని, వ్యవసాయ కూలీలంతా ఏకతాటిపైకి వచ్చి ప్రతిఘటించి చట్టాన్ని కాపాడుకోవాల్సి ఉందని ఉపాధిహామీ పనిదినాలు, వేతనాల పెంపు, పట్టణాలకు వర్తింపజేయాలంటూ నిర్వహించిన రాష్ట్ర సదస్సులో వక్తలు ముక్తకంఠంతో చెప్పారు. బుధవారం ఏలూరులోని కాశీవిశ్వేశ్వర కల్యాణమండపంలో రాష్ట్ర సదస్సు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధులుగా వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు, ఎంపీ శివదాసన్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ఉపాధి హామీచట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు బడ్జెట్‌లో రూ.28 వేల కోట్లు కోత పెట్టిందన్నారు. ఉపాధి చట్టం దండగ అంటూ దుష్ప్రచారం చేస్తూ దెబ్బతీయాలని చూస్తోందన్నారు. కరోనా సమయంలో ఉపాధి పనులే పేదలను కాపాడాయన్నారు. ఉపాధి హామీ పనిదినాలు 200 రోజులకు పెంచడంతోపాటు ప్రతియేటా రూ.మూడు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలని, పట్టణాల్లో ఈ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సదస్సులో ఈ మేరకు తీర్మానం ఆమోదించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న పలువురు నేతలు మాట్లాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డిఎన్‌విడి.ప్రసాద్, తెల్లం రామకృష్ణ, పి.కిషోర్, ఆర్.లింగరాజు, జి.రాజు, ఎం.నాగమణి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రెండు కోట్ల మందికి భూమి, ఇల్లు లేదు
వి.వెంకటేశ్వర్లు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల కుటుంబాలకు భూమిగాని, ఇళ్లుగాని లేవు. వీరంతా రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలే. పశ్చిమగోదావరిలో రెండు లక్షల ఎకరాలు ఆక్వా చెరువులుగా మారిపోయాయి. పనిదినాలు తగ్గిపోయాయి. రోడ్ల పనులు సైతం యంత్రాలే చేస్తున్నాయి. మరి పేదలు ఏవిధంగా బతకాలి. పేదలకు అండగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని మోడీ సర్కార్ దెబ్బతీయాలని చూడటం దారుణం. ప్రతి కుటుంబానికీ రెండెకరాల భూమైనా, 200 రోజులు పనైనా ఉండాలి. ఉపాధి చట్టం భిక్ష కాదు. ఉపాధి సొమ్ముతో రోడ్లు, భవనాలు నిర్మిస్తూ కాంట్రాక్టర్లకు మేలు చేస్తున్నారు.
ఉపాధి చట్టాన్ని కలిసికట్టుగా కాపాడుకుందాం
మంతెన సీతారాం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
ఉపాధి హామీ చట్టం అంటే బటన్ నొక్కి డబ్బులు వేసేది కాదు. ఆనాడు 2004లో పార్లమెంట్లో 63 మంది వామపక్ష సభ్యులు ఉండబట్టి పోరాడి సాధించుకున్న చట్టం. ఆ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వామపక్ష నాయకులకు మంత్రి పదవులు ఇస్తానన్న వద్దని, ప్రజలకు ఉపయోగపడే పథకాలు కావాలని, అలాంటి పథకాలకు అంగీకరిస్తేనే మద్దతిస్తామని చెప్పటంతో గత్యంతరం లేక నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి అంగీకరించి చట్టం చేసింది. దీనిని ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో గ్రామీణ కూలీలు ఐక్యంగా దీనిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
ఎర్రజెండా అధికారంలోకి రావాల్సిందే
షేక్ సాబ్జీ, ఉపాధ్యాయ ఎంఎల్‌సి
చట్టసభల్లో ఎర్ర జెండాకు ప్రాతినిధ్యం తగ్గడం వల్ల ప్రజా సమస్యల గురించి చర్చించేవాళ్లు లేకుండాపోతున్నారు. ప్రస్తుత పాలకులు కార్పొరేట్లు, భూస్వాముల లబ్ధి కోసం ఆలోచిస్తున్నారు తప్ప సామాన్య ప్రజల గురించి ఆలోచించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా మేల్కొని ఎర్రజెండాకు ఓటు వేసి చట్టసభల్లో వామపక్ష ప్రతినిధులు ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎర్రజెండా అధికారంలోకి రావాల్సిందే.
కరోనాలో ఉపాధి చట్టం గొప్పతనం తెలిసింది
ఎ.రవి, సిపిఎం జిల్లా కార్యదర్శి
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. కరోనా సమయంలో అందరికీ పని దొరికింది ఈ చట్టం వల్లే. చట్టం గొప్పతనం అప్పుడే అందరికీ తెలిసింది. పట్టణాల్లో పరిశ్రమలు మూతపడి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి పనులు కల్పించాలి.
చట్టాలను నీరుగారుస్తున్నారు
మన్నవ కృష్ణ చైతన్య, సిపిఐ జిల్లా కార్యదర్శి
ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి ఎన్నో చట్టాలు పోరాడి సాధించుకున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వాలు వాటిని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయి. దేశంలో సంపద అంతా కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఇద్దరు అమ్మేవాళ్లు, ఇద్దరు కొనేవాళ్లు ఈ దేశాన్ని శాసిస్తున్నారు. అలా కాకుండా అన్ని వర్గాలకు మేలు జరగాలంటే చట్టసభల్లో ఎర్రజెండా ప్రాతినిధ్యం పెరగాలి. ప్రజల ఆస్తులకు రక్షణ ఉండాలి. కాబట్టి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి.
ప్రజలు సంఘటితంగా పోరాడాలి
పోరండ్ల శ్రీనివాస్, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు
రోజురోజుకీ ఉపాధి కూలీల సంఖ్య పెరుగుతుంది. ఉద్యోగావకాశాలు లేకపోవడంతో చదువుకున్న యువత కూడా ఉపాధి కూలీలుగా మారుతున్నారు. గిట్టుబాటు ధరలు లేక నష్టాలు వచ్చి పేద రైతులు కూడా ఉపాధి కూలీలుగా మారుతున్నారు. ప్రభుత్వాలు పథకాలకు నిధులు పెంచకుండా ఉన్న పథకాలు నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన సిపిఎం ఇలాంటి సదస్సు నిర్వహించడం అభినందనీయం. ఉపాధి హామీ లాంటి చట్టాలను కాపాడుకునేందుకు ప్రజలు సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉంది.
కూలీలంటే ఈ ప్రభుత్వాలకు చిన్నచూపు
వి. శివ నాగరాణి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నేత
దేశంలో, రాష్ట్రంలో ఆకలి చావులు పెరిగాయి. కనీస వేతనాలు లేవు. ఉపాధి పనులు లేక గ్రామీణ ప్రజలు పట్టణాలకు వలసలు పోతున్నారు. మరోపక్క వర్షాలు లేవు. పనుల కోసం కూలీలు ఆటోల్లో వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నా ప్రభుత్వాలు నష్టపరిహారం ఇవ్వడం లేదు. కూలీలు అంటే ఈ ప్రభుత్వాలకు చిన్న చూపు ఉంది. ఈ సమస్యలను నవంబర్ 15న విజయవాడలో జరిగే సభలో చర్చించాల్సిన అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేలా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది.