Oct 11,2023 22:33

డ్వామా పీడీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న వ్యకాసం నాయకులు

       అనంతపురం కలెక్టరేట్‌ : కూలీలకు ఎంతో ఉపయోగంగా ఉన్న ఉపాధి హమీ చట్టానికి నిధులను తగ్గించి దానిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి, బడ్జెట్లో రెండు లక్షల కోట్ల నిధులు కేటాయించాలని, పట్టణాలకు ఉపాధి హామీ విస్తరించాలని కోరుతూ బుధవారం నాడు డ్వామా పీడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం నిధులను తగ్గిస్తూ, ఆన్లైన్లో రకరకాల మార్పులు చేయడం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం దీనిని పూర్తిగా రద్దు చేసే కుట్రకు పూనుకుంటోందనే అనుమానం వ్యక్తం అవుతోందన్నారు. కూలీలకు ఎంతో ఆసరగా ఉన్న ఉపాధిని మరింత పటిష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పీడీ వేణుగోపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యకాసం జిల్లా అధ్యక్షుడు సూరి, ఉపాధ్యక్షులు వెంకటేశు, ఏర్రినాగప్ప, భాస్కర్‌, నాగలింగ, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
పట్టాలు మంజూరు చేయండి
పేదల సాగు చేసుకున్న భూములకు సాగు పట్టాలు ఇవ్వాలని అనంతపురం ఆర్డీవో కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కూడేరు మండలంలోని సర్వే నెంబర్‌ 535లో సాగులో ఉన్న పేదలకు అసైన్మెంట్‌ కమిటీలో సాగుపట్టాలి ఇవ్వాలన్నారు. వీటితో పాటు కూడేరు, శింగనమల, బుక్కరాయసముద్రం, పుట్లూరు, గార్లదిన్నె మండలంలో భూ సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు.