May 09,2023 22:25

ప్రజాశక్తి - కలిదిండి
        ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు సహించరానివని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ అన్నారు. మండలంలోని భాస్కరరావుపేట, గుర్వాయిపాలెం, కలిదిండి, పడమటిపాలెం, ఎస్‌ఆర్‌పి అగ్రహారం, సానా రుద్రవరం గ్రామాల్లో ఉపాధి హామీ రక్షణ యాత్ర సాగింది. ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలు అడిగితెలుసుకున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తూ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. రెండు పూటలా ఉపాధి పనుల వల్ల పనిదినాలు కోల్పోవాల్సి వస్తోందన్నారు. 200 రోజుల పని, రూ.600 రోజు వేతనంతో పాటు పాత పద్ధతిలోనే ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఈ నెల 12వ తేదీన ఏలూరు కలెక్టరెట్‌ వద్ద జరిగే ధర్నాలో పాల్గొనాలని సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శేషపు మహంకాళిరావు అన్నారు. జిల్లా కమిటీ సభ్యులు జక్కుల మహేష్‌, చిన్నం మాధవ, వీరవల్లి భాస్కరరావు, కార్యకర్తలు వీరరాఘవులు, వెంకటేశ్వరరావు, బొడ్డు సురేష్‌, బుస్సా రామ నాగేంద్రం పాల్గొన్నారు.
నేడు ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నా
జంగారెడ్డిగూడెం:ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈనెల పదో తేదీన స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం వద్ద చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం పిలుపునిచ్చారు. మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్ట రక్షణకు మండలంలోని లక్కవరం, దేవులపల్లి, శ్రీనివాసపురం, పట్టినపాలెం గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల పని ప్రదేశాల్లో పర్యటించారు. అనంతరం కూలీలతో జీవరత్నం మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వ పాలనలో ఉపాధి హామీ చట్టం నిర్వీర్యమైందన్నారు. ఈ చట్టానికి బడ్జెట్‌లో నిధులు భారీగా తగ్గించారని తెలిపారు. పేదల ఉపాధికి కేటాయించాల్సిన నిధులు అంబానీ, అదానీలకు పన్ను రాయితీల రూపంలో ఇవ్వడం దుర్మార్గమని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్‌ మొబైల్‌ మోనటరింగ్‌ ఫొటో విధానం రద్దు చేయాలని, పాతపద్ధతిలో పే స్లిప్పులు, వేసవి అలవెన్సులు, సైట్‌ సూపర్‌వైజర్లకు పారితోషికం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జంగారెడ్డిగూడెం డివిజన్‌ పరిధిలోని పది మండలాల్లో ఐదు రోజులపాటు ప్రచార యాత్రలు నిర్వహించామని, వంద గ్రామాలు తిరిగి ఉపాధి కూలీలను కలిశామన్నారు. ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జోడే సూర్యచంద్రరావు, పిల్లి చంటి, నిట్టా నాగరాజు పాల్గొన్నారు.
ముదినేపల్లి : ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవడానికి ఈనెల 12వ తేదీన కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాలో మండలంలోని వ్యవసాయ కూలీలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ కోరారు. పని ప్రదేశాల వద్దకు యాత్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని ములకలపల్లి, వణుదుర్రు, అల్లూరు, సింగరాయపాలెం తదితర గ్రామాల్లో మంగళవారం పర్యటించి వ్యవసాయ కూలీలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌.మహంకాళిరావు, జిల్లా కమిటీ సభ్యులు జె.మహేష్‌, సిహెచ్‌.మాధవ, మండల నాయకులు దాకారపు నాగేశ్వరరావు, రాధాకృష్ణ పాల్గొన్నారు.