May 08,2023 21:51

ప్రజాశక్తి - నూజివీడు
          ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రకరకాల నిబందనలు తీసుకొస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్‌.నరసింహ విమర్శించారు. ఉపాధి హామీ పరిరక్షణకు వ్యకాస ఆధ్వర్యాన చేపట్టిన యాత్ర ఐదో రోజు నూజివీడు మండలంలోని మొర్సపూడి, గొల్లపల్లి, మీర్జాపురం, ముఖసానరసన్నపాలెం, పల్లేర్లమూడి గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా ఉపాధి పనిప్రదేశాల్లో కూలీలను కలిసి వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ, ఎన్‌.నరసింహా మాట్లాడుతూ ఉపాధిహామీ చట్టానికి 2023-24 కేంద్ర బడ్జెట్‌లో నిధులను భారీగా తగ్గించిందన్నారు. వంద రోజుల పని కల్పించేందుకు ఉపాధి హామీకి రూ.2.72 లక్షల కోట్లు అవసరమని ఒక అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం ఆ మేర నిధులు పెంచకపోవడం దుర్మార్గమన్నారు. కేవలం రూ.60వేల కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. కూలీలకు వేతనాల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చెల్లించే ఉపాధి కూలీల వేతనాల వాటాను కూడా 60:40 (కేంద్రం:రాష్ట్రం) నిష్పత్తిలో పంచుకోవాలని ప్రభుత్వం చెప్పడం ప్రమాదకరమైన నిర్ణయమన్నారు. భవిష్యత్తులో ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే కుట్రలో భాగమే ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నారని తెలిపారు. బడా కార్పొరేట్‌ సంస్థలకు ఏటా లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలు, మినహాయింపులు వర్తింపజేసేందుకు వెనుకాడని మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి తగినన్ని నిధులు కేటాయించడానికి సుముఖంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం పేదల కోసం కాకుండా ధనికులు, కార్పొరేట్‌ల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. పని దినాల సంఖ్యను 200 రోజులకు పెంచాలని, అడిగివారికి పనులు చూపాలని, రోజుకు రూ.600 వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీనితో పాటు పట్టణాల్లోనూ ఉపాధి పనులు చూపాలని, దీనికోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పి.మురళీ, ఎస్‌.మహంకాళీ, జిల్లా కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, రాజశేఖర్‌, దాసు పాల్గొన్నారు.
టి.నరసాపురం : ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్‌లో నిధులు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మానుకొండ జీవరత్నం డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ చేపట్టిన ఉపాధి హామీ రక్షణ యాత్ర మండలంలోని అప్పలరాజుగూడెం, మధ్యాహ్నపువారిగూడెం, సాలిగూడం, అబ్దుల్లాపురం, మల్లప్పగూడెం, బచ్చులేటిగూడెం, రామమ్మగూడెం, అల్లూరి సీతారామరాజునగర్‌లో సాగింది. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాలమ్మ, తుమ్మల సత్యనారాయణ, కారం నాగదుర్గ, మడకం సుధారాణి, యాగంటి సీత పాల్గొన్నారు.
జీలుగుమిల్లి : 'ఉపాధి' కూలీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర మండలంలోని తాటియాకులగూడెం, వంకవారిగూడెం, కామయ్యపాలెంలో సాగింది. యాత్ర నాయకులు కూలీల వద్దకు వెళ్లి సమస్యలు అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు జీవరత్నం, రాష్ట్ర కమిటీ సభ్యులు తామ ముత్యాలమ్మ మాట్లాడుతూ ఈనెల పదో తేదీన జంగారెడ్డిగూడెంలోని ఆర్‌డిఒ కార్యాలయం వద్ద చేపడుతున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కె.నాగదుర్గ, పాముల పాపారావు, తుమ్మల సత్యనారాయణ, గూడెల్లి వెంకట్రావు, మడకం గాయత్రి పాల్గొన్నారు.
చాట్రాయి : ఈనెల 13వ తేదీన నూజివీడు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఉపాధి హామీ చట్ట పరిరక్షణకు చేపడుతున్న ధర్నాను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చేపట్టిన యాత్ర మండలంలోని చిన్నంపేటకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి చూపాలని, పే స్లిప్పులు ఇవ్వాలని, పనిప్రదేశాల్లో టెంట్లు ఏర్పాటు చేయాలని కోరారు. మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేయాలని, ఎఎన్‌ఎంను, ఆశా కార్యకర్తను కేటాయించాలని, ఖాళీగా ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎం.హోలీ మేరీ, కెవిపిఎస్‌ మండల కార్యదర్శి కొమ్ము ఆనందం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఆగిరిపల్లి : ఉపాధి హామీలో ప్రవేశపెట్టిన నేషనల్‌ మొబైల్‌ మోనటరింగ్‌ ఫొటో విధానాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పిల్లి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పరిరక్షణ జిల్లా యాత్ర ఆదివారం రాత్రి ఆగిరిపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యకాస నాయకులు పిల్లి మురళీ, చాకిరి శివనాగరాజు, సత్తు కోటేశ్వరరావు, రాజశేఖర్‌ పాల్గొన్నారు.