ప్రజాశక్తి -భీమునిపట్నం : దాదాపు 40ఏళ్ల పైబడి మండలంలోని దాకమర్రి ఎర్ర క్వారీ వద్ద రాళ్ళు కొట్టుకుని బతుకుతున్న తమ ఉపాధిని జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో దెబ్బ తీయొద్దని క్వారీ కార్మికులు గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. క్వారీ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన జరిగిన ధర్నానుద్దేశించి యూనియన్ అధ్యక్షులు ఆర్‌ఎస్‌ఎన్.మూర్తి మాట్లాడుతూ, రేఖవానిపాలెం పంచాయతీకి చెందిన 83 మందికి ఎర్రక్వారీ వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించడంలో అర్ధం లేదన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న చిత్త శుద్ధి ఉంటే అదే పంచాయతీలో పదుల ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరారు. ప్రమాద కరమైన క్వారీ వద్ద ఇళ్ల స్థలాలు ఇవ్వడమంటే లబ్ధిదారుల ప్రాణాలతో ఆడుకున్నట్లేనని ఆందోళన వ్యక్తంచేశారు. సిఐటియు భీమిలి జోన్ కార్యదర్శి రవ్వ నరసింగరావు మాట్లాడుతూ, సుమారు 16 ఎకరాల విస్తీర్ణం గల ఎర్ర క్వారీ వద్ద 40 ఏళ్లుగా దాదాపు వంద మంది కార్మికులు పనిచేస్తున్నారని, క్వారీయే జీవనాధారంగా బతుకుతున్నారని వివరించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వ్యతిరేకం కాదని, అనువైన చోట ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్వారీ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) కార్యదర్శి ముద్దాడ రాము, క్వారీ కార్మికులు తోటయ్య, రామారావు, నాయుడు, దేముడు, అప్పలస్వామి తది తరులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కోరాడ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు.










