
* కాగ్ రాష్ట్ర ఇన్‌ఛార్జి ప్రియాంక నశీనా
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : ఉపాధి హామీలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) రాష్ట్ర ఇన్‌ఛార్జి ప్రియాంక నశీనా అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సోమవారం దర్శించారు. వారికి ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతించారు. స్వామివారి సేవల్లో పాల్గొన్న అనంతరం అనివెట్టి మండపంలో శేష వస్త్రాలు, మెమోంటోలను వారికి అందజేశారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా నిధులు కేటాయిస్తోందన్నారు. అందులో భాగంగా ఈ ఏడాది రూ.24 వేల కోట్లను విడుదల చేసినట్లు వివరించారు. 2021 నుంచి ఆర్థిక శాఖలో పూర్తిస్థాయి సంస్కరణలు చేపట్టినట్లు చెప్పారు. ఆర్థిక రంగం పారదర్శకంగా ఉండేందుకు, రాష్ట్రాలకు కేటాయించే నిధులు సకాలంలో వ్యయం కావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి రూ.7,500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు వాటా జమ చేస్తే అనంతరం కేంద్రం మాచింగ్ గ్రాంట్ కలుపుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 22 రకాల అభివృద్ధి పనులకు రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు సిఎఫ్‌ఎంఎస్ తరహాలో కేంద్ర ప్రభుత్వం పిఎఫ్‌ఎంఎస్ అమలు చేస్తోందని చెప్పారు. దశాబ్దాలుగా మరమ్మతుల్లేక సాగునీరు అందని సాయన్న ఛానల్ ఆధునికీకరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. దీనికింద ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస మండల పరిధిలో సుమారు 12 వేల ఎకరాలు సాగవుతుందన్నారు. త్వరలో టెండర్లు పిలిచి, పనులు ప్రారంభిస్తారని తెలిపారు.