ప్రజాశక్తి-బాపట్ల రూరల్: ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించడం దారుణమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్ అన్నారు. ఈ నెల 5వ తేదీన బాపట్ల కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా విజయవంతం చేయాలని ఆయన ప్రచారం నిర్వహించి కూలీలతో మాట్లాడారు. బాపట్ల మండలం మూలపాలెం గ్రామంలో శుక్రవారం కార్మిక సంఘం ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో వ్యవసాయ కూలీల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకొన్నారు. ఈ నెల 5వ తేదీన ఉపాధి సమస్యల పరిష్కారంపై కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో ఉపాధి కూలీలు పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కృష్ణ మోహన్ మాట్లాడుతూ వంద రోజులకు తగ్గకుండా పని చూపించాలని అన్నారు. కూలి డబ్బులు సక్రమంగా వచ్చే విధంగా చూడాలని కూలీలు కోరారు. ఆన్‌లైన్ ఫొటో విధానాన్ని ఎత్తివేయాలని, పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, గతంలో లాగా సమ్మర్ అలవెన్స్ పలుగు, పారకు డబ్బులు ఇవ్వాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి భారీగా నిధులు తగ్గించడం వల్ల ఉపాధి కూలీలు పనిచేసే చోట కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేని దుస్థితి ఏర్పడిందని కృష్ణమోహన్ అన్నారు. ఉపాధి కూలీలు ఫొటో యాప్ ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనీసం పనిచేసేచోట టెంటు సౌకర్యం, మంచినీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్టు, ఇతర బీమా సౌకర్యం లేకపోవడం అన్యాయమని అన్నారు. ఈ సౌకర్యాలు లేకపోవడంతోనే తీవ్రమైన ఎండలు ఉండడంతో వడదెబ్బ తగిలి కూలీలు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఇచ్చే బీమా సౌకర్యం కూడా ఇవ్వడం లేదన్నారు. తక్షణమే పైస్థాయి అధికారులు ఇటువంటి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఈ విషయంపై ఉపాధి కూలీలతో జూన్ ఐదో తేదీన బాపట్ల కలెక్టరేట్ వద్ద ధర్నా జరుగుతుందని, కూలీలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేస్త్రీలు బాబూరావు, ఎస్తేరురాణి, కళావతి, మేరెమ్మ, జ్యోతి, కూలీలు పాల్గొన్నారు.
పంగులూరు: పేదలకు ఉపాధి కల్పించి, వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆ ప్రయత్నాలను అడ్డుకొని చట్టాన్ని కాపాడుకునేందుకు వ్యవసాయ కార్మికులంతా ఉద్యమిం చాలని, వ్యవసాయ కార్మిక సంఘం పంగులూరు మండల కమిటీ సమావేశం తీర్మానించింది. కమిటీ సమావేశం శుక్రవారం పంగులూరులో ఆదుం సాహెబ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడు మోండ్రు ఆంజనేయులు మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకునేందుకు వ్యవసాయ కూలీలంతా ఉద్యమించాలని అన్నారు. ఈ నెల 5వ తేదీన బాపట్లలోని జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ధర్నా కార్యక్రమంలో ఉపాధి కూలీలంతా హాజరై జయప్రదం చేయాలని అన్నారు. సంఘం నాయకుడు పూసపాటి సుబ్బరాజు మాట్లాడుతూ వ్యవసాయ కూలీలను ఐక్యపరిచి ఉద్యమాల్లోకి నడిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు తానికొండ సుధాకర్, చింతలచెరువు బాబురావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాయిని వినోద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
బల్లికురవ రూరల్: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగే ధర్నాని జయప్రదం చేయాలని కోరుతూ మండలంలోని కూకట్లపల్లి, గొర్రెపాడు గ్రామాలలో శుక్రవారం వ్యవసాయ సంఘ ఉపాధ్యక్షుడు జిల్లా తంగిరాల వెంకటేశ్వర్లు పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు బాపట్ల జిల్లా వ్యవసాయ సంఘం ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువచ్చారు. కొంతమంది కార్మికులకు ఆధార్ అప్డేట్ లేదని పనులు కల్పించడం లేదని, సమ్మర్ అలవెన్స్ లేకుండా పోయాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ నెల 5వ తేదీన జరిగే ధర్నాలో ఉపాధి కార్మికులందరూ పాల్గొనాలని వెంకటేశ్వర్లు ఉపాధి కూలీలను కోరారు.










