Apr 02,2023 00:28

అధికారులకు విన్నవిస్తున్న నిర్వాసిత శాండుకోరి గ్రామస్తులు

ప్రజాశక్తి -సీలేరు
జీకే.వీధి మండలం సీలేరు పార్వతి నగర్‌ సమీపంలో పంపు స్టోరేజ్‌ ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం పర్యావరణ అనుమతులకు శనివారం స్థానిక ఫుడ్‌ బాల్‌ గ్రౌండ్లో ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించారు. కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీరు సుదర్శన్‌, జాయింట్‌ కలెక్టర్‌ శివ శ్రీనివాస్‌, పాడేరు సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌, ఎపి జెన్‌కో ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ పిల్ల సాంబమూర్తి, ఇన్‌ఛార్జి సర్పంచ్‌ కె.వల్లి ప్రసాద్‌ మాట్లాడుతూ పంపు స్టోరేజ్‌ ప్రాజెక్టు నెలకొల్పడానికి తాము వ్యతిరేకం కాదని తెలిపారు. అయతే స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనలో ప్రథమ ప్రాధాన్యత కల్పించాలని, 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, జీకే వీధి నుంచి సీలేరు వరకు అస్తవ్యస్తంగా ఉన్న రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, స్థానికులకు పక్క భవనాలు నిర్మించుకోవడానికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
గాలికొండ ఎంపిటిసి అంపరంగి బుజ్జిబాబు, దుప్పులివాడ సర్పంచ్‌ కుమారి, గిరిజన నాయకులు మార్క్‌ రాజు, కోడా ఆనందు, సుంకర విష్ణుమూర్తి, నక్క తిరుమలరావు మాట్లాడుతూ పంపు స్టోరేజ్‌ ప్రాజెక్టును స్వాగతిస్తున్నామని, 1/70 చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులో స్థానిక గిరిజన యువతకు పూర్తిస్థాయిలో ఉద్యోగ, ఉపాధి కల్పించాలని కోరారు. తమ గ్రామాలకు సమీపంలో విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నా, తమకు విద్యుత్‌ లేని పరిస్థితి ఉందని, అందువల్ల స్థానిక గిరిజన గ్రామాలకు సీలేరు నుంచి నేరుగా విద్యుత్‌ ఇవ్వాలని, తమ పిల్లలకు డిఎవి పాఠశాలలో ఉచితంగా విద్యను అందించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు మారిపోతూ ఉంటారని, ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలుపై ఎవరు బాధ్యత వహిస్తారని, అందువల్ల హామీలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని ధారకొండ ఎంపిటిసి అంపరంగి బుజ్జిబాబు డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న శాండుకోరి గ్రామస్తులు ప్రాజెక్టు నిర్మాణానికి తాము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కింద భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు, ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలని అధికారులకు లిఖిలపూర్వకంగా విన్నవించారు. అందుకు అధికారులు నిరాకరించారు.
ఈ సందర్భంగా హైడెల్‌ డైరెక్టర్‌ ఎంవివి.సత్యనారాయణ మాట్లాడుతూ రూ.11,880 కోట్లతో 9 యూనిట్లు, 1350 మెగా వాట్లు సామర్థ్యంతో పంపు స్టోరేజీ ప్రాజెక్టు అండర్‌ గ్రౌండ్‌ పైప్‌ లైన్‌ ద్వారా నిర్మిస్తున్నామని, దీని వల్ల ఇబ్బందులు ఏమీ ఉండవని చెప్పారు. ప్రాజెక్టు వల్ల భూములు, ఇల్లు కోల్పోయిన వారికి ఆర్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ పెరుగుతుందన్నారు. ప్రాజెక్టులో 50 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, కొంతమందికి కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇస్తామని, 500 నుంచి 1000 మంది ఉపాధి కలుగుతుందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు.
10 కిలో మీటర్ల పరిధిలోని గ్రామాలకు
న్యాయం : జెసి
జాయింట్‌ కలెక్టర్‌ శివ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల కోరిన డిమాండ్లను ఏపీ జెన్కో అధికారులు పరిశీలించి సీలేరు నుంచి పది కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు న్యాయం చేయాలని ఆదేశించారు. జీకే వీధి నుంచి సీలేరు వరకు జెన్కో నిధులతో రోడ్లు నిర్మాణం, సీలేరులో 50 పడకల ఆసుపత్రి, కనీస అవసరాలు ప్రజలకు సమకూర్చాలని సూచించారు. శాండుకోరి గ్రామ నిర్వాసితుల అడిగిన భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు, ఇంటికొక ఉద్యోగం, ఇతర అంశాలపై చర్చిస్తామన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఇచ్చిన వినతిపత్రాలతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు తెలియజేసిన విషయాలను ఆన్‌ రికార్డ్‌ చేశామని, వాటి ఆధారంగా నివేదిక అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో చీఫ్‌ ఇంజనీర్‌ శేషారెడ్డి, చీఫ్‌ ఇంజనీర్లు సుజరు కుమార్‌, బి.శ్రీధర్‌, ఎస్‌ఇ కెకెవి.ప్రశాంత్‌ కుమార్‌, ఈఈలు బాలకృష్ణ, శ్రీనివాస్‌, బాబూరావు, ప్రభాకర్‌, లక్ష్మీనారాయణ, ఏడిఈ అప్పలనాయుడు, ఏఈ సురేష్‌ పాల్గొన్నారు.
కట్టుదిట్టమైన భద్రత
ప్రజా అభిప్రాయ సేకరణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చింతపల్లి ఎఎస్‌పి శివ కిషోర్‌ పర్యవేక్షణలో జీకే వీధి, కొయ్యూరు సిఐలు అశోక్‌ కుమార్‌, స్వామి నాయుడు ఆధ్వర్యాన సుమారు 150 మంది పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రతి ఒక్కరినీ ప్రధాన గేటు వద్ద తనిఖీ చేసి, వారి వివరాలు సేకరించి లోపలకు పంపించారు. ఇందులో సీలేరు, జికె.వీధి, మంప ఎస్‌ఐలు రామకృష్ణ, అప్పలసూరి, లోకేష్‌, సిఆర్పిఎఫ్‌ 42 బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ సురేష్‌, సివిల్‌, సీఆర్పీఎఫ్‌, స్పెషల్‌ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.