May 29,2023 23:30

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి వామపక్షాలు పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం క్రమంగా నిర్వీర్యం చేయాలని చూస్తోంది. దీనిలోని భాగంగానే పలు వసతులను రద్దు చేసింది. పొమ్మనకుండా పొగ పెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వ్యవసాయ కార్మికులే పనులు వద్దనుకునే రీతిలో బడ్జెట్లో భారీగా కోత విధిస్తోంది. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం నడుం బిగించింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్న పథకానికి బడ్జెట్లో నిధులు పెంచి మరింతగా బలోపేతం చేయాలని డిమాండ్‌ చేస్తోంది. 'ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుందాం రండి, కలెక్టర్‌కు చెప్పుకుందాం కదలండి' అంటూ పిలుపునిచ్చింది. నేడు కాకినాడ కలక్టరేట్‌ ధర్నా చౌక్‌ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.
కాకినాడ జిల్లాలో రోజుకు సుమారు 90 వేల మంది ఉపాధి కూలీలు పనులకు వెళుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి చట్టం గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. కష్టకాలంలో వారి పొట్ట నింపు కోవడానికి పనికొస్తోంది. ఈ నేప థ్యంలో మరింత సమర్థ వంతంగా పద ¸కాన్ని అమలు చేయాల్సిన బిజెపి ప్రభుత్వం చట్టాన్ని క్రమంగా నిర్వీర్యం చేస్తూ వస్తోంది. రెండు పూటలా కష్టించి పనిచేస్తే రూ.220 మించి కూలి రాని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల రూ.150 మించి రావడం లేదు. వంద రోజులు పని దినాలు కల్పన సక్రమంగా అమలు కావడం లేదు. సగటు వేతనం రూ.60 మించడం లేదు. భారీగా నిధులను తగ్గించి పలు సౌకర్యాలను పూర్తిగా రద్దు చేశారు. పని ప్రదేశంలో మండుటెండలో కనీసం టెంట్లు కూడా లేని పరిస్థితుల్లో కూలీలు చెరువు, కాలువల పూడికతీత తదితర పనులు సాగిస్తున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే గాయానికి కట్టు కట్టేందుకు కూడా కనీసం ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లను కూడా ఉంచడం లేదు. తాగునీరు, మజ్జిగ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. సమ్మర్‌ అలవెన్స్‌లకు మంగళం పాడారు. గతంలో వారానికి ఒకసారి పే స్లిప్పులు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో ఎవరికీ ఎంత వేతనం పడుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. మారిన నూతన సాఫ్ట్‌వేర్‌ ప్రకారం రెండుసార్లు ఫోటోలు తీయాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్యల వల్ల గంటల తరబడి ఫోటో కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పలు గ్రామాల్లో అధికార పార్టీ నేతలు పనులకు రాకపోయినా అక్రమంగా మస్తర్లు వేసుకుంటున్నారు. ఇలా అనేక సమస్యలు ఉపాధి పథకంలో కొనసాగుతున్నాయి.
విస్తతంగా ప్రచారం
ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు, కెఎస్‌.శ్రీనివాస్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ఉపాధి హామీలో నెలకొన్న సమస్యలను కలెక్టర్‌ దష్టికి తీసుకురానున్నారు. భారీ సంఖ్యలో కూలీలు తరలి రానున్నారని వారు తెలిపారు. ఈ మేరకు 15 రోజులుగా జిల్లాలో అన్ని మండలాల్లోనూ విస్తతంగా ప్రచారం చేశారు. దాదాపు అన్ని గ్రామాల్లో పర్యటించిన నాయకులు ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై కూలీలకు వివరించారు.