ప్రజాశక్తి-హుకుంపేట:ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరుతూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల కార్యదర్శి తాపుల కృష్ణారావు మాట్లాడుతూ, భూర్జా పంచాయితీ సులిపకోన్, సొంటర్ల పాడు, కొండరుపాడు గ్రామాలకు ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా నేటికి సులిపకోన్, సొంటర్ల పాడు, కొండయ్య పాడు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించక పోవడం దారుణమన్నారు. కూలీ పనులు లేక పోవడంతో మైదాన ప్రాంతాలకు వలస వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలరోజులో ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధిహామీ హామీ పనుల కల్పనలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి, శాఖ పరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పనులను తక్షణమే కల్పించక పొతే ఉపాధి హామీ కూలీలతో భారీ ఎత్తున మండల ఉపాధి ఏపీఓ కార్యాలయం ముట్టడిస్తామని అయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుకుంపేట మండల పరిషత్ వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, సీపీఎం మండల కార్యదర్శి లక్ష్మణ్‌రావు, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు కిల్లో రామారావు, ఉపాధి హామీ కూలీలు మజ్జి చంద్రన్న, చిట్టిబాబు, తులసి బాబు, చంటి, నన్నారావు, బాలన్న, రమేష్, నాగేష్, పండన్న తదితరులు పాల్గొన్నారు.










