Jan 11,2023 23:29

సామాజిక తనిఖీల్లో వివరాలు సేకరిస్తున్న అధికారులు

డ్వామా పీడీ రమేష్‌ రామన్‌
ప్రజాశక్తి-రాజవొమ్మంగి

2020-21, 2021-3022 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మండలంలో రూ.13.57 కోట్లు ఉపాధి పనులు జరగగా అందులో రూ.56.37 లక్షలు మేరకు అవకతవకలు జరిగినట్లు డ్వామా పీడీ రమేష్‌ రామన్‌ తెలిపారు. మంగళవారం రాత్రి వరకు స్థానిక ఉపాధి హామీ కార్యాలయం ఆవరణలో డ్వామా పిడి ఆధ్వర్యంలో ఎంపీడీవో బాపన్న దొర అధ్యక్షతన పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల్లో జరిగిన ఉపాధి పనులు గురించి సిబ్బంది వివరించారు. అనంతరం డ్వామా పీడీ విలేకర్లతో మాట్లాడుతూ మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులలో భాగంగా 13, 14 దఫా సోషల్‌ ఆడిట్‌గాను గతేడాది డిసెంబర్‌ 27 నుండి ఈ ఏడాది జనవరి 9 వరకు 19 పంచాయతీల పరిధిలోని గ్రామాలలో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి గ్రామసభల్లో ఉపాధి హామీ పనులపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నట్లు చెప్పారు. ఉపాధి పనుల్లో జరిగిన అవినీతికి సంబంధించి ఉపాధి సిబ్బంది నుండి సుమారు రూ.72 వేలు రికవరీ చేయాల్సి ఉందన్నారు. రూ.44లక్షల వేతనానికి గాను మొక్కలు, పనులు వారం రోజుల్లో పూర్తి చేసి సరి చేయాల్సి ఉందని చెప్పారు. రూ.9 లక్షల వరుకు సిబ్బంది ఎవిడెన్స్‌ చూపించాల్సి ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, జెడ్పిటిసి వడుగుల జ్యోతి, జిల్లా విజిలెన్స్‌ అధికారి నిర్మలా దేవి, ఉపాధి హామీ ఏపీడి భాగ్యరావు, డిపిఎం పరమేష్‌, ఏపీఓ సురేష్‌ కుమార్‌, ఎస్‌ఆర్పి డి.రాజేంద్రరావు, డిఆర్పిలు చిన్న కృష్ణయ్య, ప్రసాద్‌, అశోక్‌, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.