ప్రజాశక్తి - పెదవేగి
ఉపాధి హామీ పనులకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో కోత విధించడం దారుణమని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర మండలంలోని గోపన్నపాలెం, పెదవేగి, రాట్నాలకుంట, విజయరాయి, నడిపల్లి, రామచంద్రపురం, అయ్యపరాజుగూడెం గ్రామాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చేందుకు కేంద్రం బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా పనది దినాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బడా కార్పొరేట్ సంస్థలకు ఏటా లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలు, మినహాయింపులు వర్తింపజేసేందుకు వెనుకాడని మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీకి తగినన్ని నిధులు కేటాయించడానికి సుముఖంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఉపాధి హామీ పని దినాల సంఖ్యను 200 రోజులకు పెంచాలని, పనికోరే వారందరికీ పని కల్పించాలని, రోజుకు రూ.600 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించి, దానికోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ సహాయ కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ, నేతలు రాజశేఖర్, దాసు, పాల్గొన్నారు.
లింగపాలెం: ఉపాధి హామీ పనుల్లో సైట్ సూపర్‌వైజర్లను నియమించాలని, వారికి ఒక్కో ఉపాధి కూలికి రూ.ఐదు చొప్పున వేతనాలు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పివి.రామకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పరిరక్షణ కోసం వ్యవసాయ కార్మిక సంఘం చేపట్టిన యాత్ర శనివారం మండలంలోని అయ్యపరాజుగూడెం, కలరాయనిగూడెం, వెంకటాపురం, కాటంరెడ్డిపల్లి, ధర్మాజీగూడెం, మఠంగూడెం, సుందరాజుపేట, తోచిలక లింగపాలెం గ్రామాల మీదుగా సాగింది. గ్రామాల్లోని వ్యవసాయ కూలీలకు, ఉపాధి కూలీలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో 20 మందికి ఒక మేట్ (మేస్త్రి) ఉండేవారని, ఇప్పుడు మేట్ల వ్యవస్థను రద్దు చేశారని అన్నారు. 20 మంది గ్రూపును 50 మందికి పెంచి సైట్ సూపర్‌వైజర్లను నియమిస్తామని చెప్పినా ఇప్పటి వరకూ విధివిధానాలను సైతం ప్రకటించలేదన్నారు. దీంతో పని చేయించడం ఇతర పనులు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇబ్బందిగా మారిందన్నారు. మన రాష్ట్రంలో పాత పద్ధతిలోనే ఉపాధి హామీ పనులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవడానికి ఈ నెల 12న ఏలూరు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో పెద్దఎత్తున కూలీలు పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.రవి, తుమ్మల సత్యనారాయణ, రాజశేఖర్, దాసు, వెంకటేశ్వర్లు, జ్యోతి పాల్గొన్నారు.
కుక్కునూరు: ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర శనివారం కుక్కునూరు చేరుకుంది. కొండపల్లి, మారేడుబాక, కివ్వాక, దాచారం, కిష్టారం, కొర్లకుంట, అరవపల్లి గ్రామాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా నిర్వాసితుల సంఘం జిల్లా నాయకులు గుడెల్లి వెంకట్రావు మాట్లాడారు. ఈ నెల 10న జంగారెడ్డిగూడెం ఆర్‌డిఒ కార్యాలయంవద్ద జరిగే ధర్నాలో అధిక సంఖ్యలో కూలీలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ యాత్రలో వ్యకాస జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం, జిల్లా ఉపాధ్యక్షులు యర్రంశెట్టి నాగేంద్రరావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
వేలేరుపాడు: ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర శనివారం వేలేరుపాడు మండలం వసంతవాడ చేరుకుంది. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం, నేత తామా ముత్యాలమ్మ మాట్లాడారు. రేపాకగొమ్ము, వేలేరుపాడు అంబేద్కర్ సెంటర్ మీదుగా యాత్ర సాగింది. కార్యక్రమంలో నేతలు కారం వెంకట్రావు, ధర్ముల రమేష్, మడివి దుర్గారావు, ఏసుబాబు, ప్రభాకర్, ప్రకాష్, రాంబాబు, నాగు, కిరణ్ చంటి పాల్గొన్నారు.
చింతలపూడి: నగర పంచాయతీలకు, పట్టణ ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయించి ఉపాధి హామీ పనులను విస్తరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ అన్నారు. చింతలపూడి ప్రాంతంలో చింతలపూడి, పాత చింతలపూడి, మల్లాయిగూడెం, శివాపురం తదితర గ్రామాల్లో యాత్ర సాగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ చింతలపూడి నగర పంచాయతీలో ఉపాధి పనులు చూపాలన్నారు. కార్యక్రమంలో సత్యనారాయణ, రమణరావు పాల్గొన్నారు.
పోలవరం: ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పోలవరం చేరుకుంది. ఈ సందర్భంగా వ్యకాస నేత గుడెల్లి వెంకట్రావు మాట్లాడారు.










