ఉపాధి కూలీలకు సూచనలిస్తున్న ఎపిఒ మాధవ శంకర్
ప్రజాశక్తి - చిప్పగిరి
గత వారం నుంచి అధికంగా ఎండలు ఉన్న నేపథ్యంలో ఉపాధి పనులు చేసుకునే దగ్గర తగిన జాగ్రత్తలతో ఉండాలని ఎపిఒ మాధవ శంకర్ ఉపాధి హామీ కూలీలకు సూచించారు. మంగళవారం రామదుర్గం, కుందనగుర్తి గ్రామాల్లో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్, నాగరాజు ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతం దగ్గర పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉదయం ఎంత త్వరగా వస్తే అంత త్వరగా పనులు చేసుకుని వెళ్లడానికి వీలుంటుందని తెలిపారు. వేతనం రూ.272 వర్తించేలా పనులు చేసుకోవాలన్నారు. రెండు, మూడు వారాల నుంచి వేతనాలు త్వరగా వస్తున్నాయన్నారు. ఉపాధి పనులను రోజూ 4,500 మంది వరకు సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. పనులు దగ్గర తప్పనిసరిగా తాగునీరు ఉండేలా చూసుకోవాలని తెలిపారు.










