ప్రజాశక్తి - దేవనకొండ
ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని వ్యకాస జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ కోరారు. రెండు పూటల హాజరును రద్దు చేయాలని, రూ.600 వేతనం పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని తెర్నేకల్, పాలకుర్తి గ్రామాల్లో వ్యకాస మండల కార్యదర్శి మహబూబ్ బాషతో కలిసి ఉపాధి పర్యటనలు నిర్వహించారు. ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వ్యకాస ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వ్యవసాయ కూలీలను కూడగట్టి పోరాడడంతో ఉపాధి హామీ చట్టాన్ని సాధించుకున్నామని తెలిపారు. కేంద్రంలోని బిజెపి 9 ఏళ్ల పాలనలో నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తూ ఉపాధి హామీ పనులకు బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి హామీ పనిని ఎత్తివేయడానికి రెండుసార్లు ఫొటో విధానాన్ని తీసుకొస్తున్నారని తెలిపారు. వేసవి అలవెన్స్ సవరిస్తూ పనుల దగ్గర వసతులను తగ్గిస్తున్నారని చెప్పారు. పని చేసి నెలలు గడుస్తున్నా బిల్లులు మంజూరు చేయకుండా ఇతర వాటికి మళ్లిస్తూ ఉపాధి కూలీల కడుపులు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీకి నిధులు పెంచాలని, ఆన్‌లైన్ ద్వారా రెండుసార్లు ఫొటో యాప్‌ను రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని కోరారు. పే స్లిప్పులు ఇవ్వాలని, రవాణా చార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పని చేసే చోట టెంటు, మెడికల్, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని, ప్రమాద బీమా కొనసాగించాలని కోరారు. కొత్త పనిముట్లు ఇవ్వాలని, జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ 200 రోజులు పని దినాలు కల్పిస్తూ ఒక్కొక్కరికి రూ.600 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పని కోరే వారందరికీ పని కల్పించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి ఈనెల 22న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధి కూలీలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. దొడ్డప్ప, తిమ్మప్ప, నబీ, శివ, ఈశ్వర్ రెడ్డి, మల్లికార్జున, చిన్న తిక్కప్ప, వెంకట్రాముడు, లక్ష్మీ, పద్మావతి, రంగమ్మ, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న వీరశేఖర్










