ప్రజాశక్తి - దేవనకొండ
మండల వ్యాప్తంగా 6 నుంచి 8 వారాల ఉపాధి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని, రెండు నెలలుగా ఉపాధి వేతనాలు రాకుంటే, ఇవ్వకుంటే ఎలా పని చేయాలని, వెంటనే ఉపాధి పెండింగ్ బిల్లులను కూలీల ఖాతాకు జమ చేయాలని వ్యకాస జిల్లా అధ్యక్షులు బి.వీరశేఖర్, సిఐటియు మండల కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. బుధవారం వ్యకాస జిల్లా కమిటీ పిలుపుమేరకు మండలంలోని కరివేముల గ్రామంలో పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని వ్యకాస ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు ధర్నా చేపట్టారు. వ్యకాస మండల నాయకులు రాముడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రెండు, రెండున్నర నెలలుగా ఉపాధి వేతనాలు రాకుంటే కూలీలు ఏం తిని బతకాలని ప్రశ్నించారు. వెంటనే పెండింగ్ బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పని చేసే ప్రదేశంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. గతంలో ఇస్తున్న పాత పద్ధతిలోనే అలవెన్స్‌లు ఇవ్వాలని తెలిపారు. 200 రోజుల పనిదినాలు, రూ.600 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్ష్మన్న, మోహన్, రంగమ్మ, ఈరన్న, రామకృష్ణ, దాస్, పోగన్న పాల్గొన్నారు. ఆదోని (రూరల్) మండలం గోనబావి, పాండవగల్లు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలు నిరసన చేపట్టారు. వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు కె.లింగన్న, మండల నాయకులు కె.గోవిందు, ఆయా గ్రామాల నాయకులు ప్రసాద్, వీరప్ప, ఆంజనేయ, దేవయ్య మాట్లాడారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం పని చేసిన 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించాలని తెలిపారు. రెండు నెలలు గడుస్తున్నా ఒక్క వారం వేతనం కూడా అందలేదన్నారు.
కరివేముల సచివాలయం ముందు ధర్నా చేపడుతున్న నాయకులు










