May 18,2023 19:58

ఆదోనిలో ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న లింగన్న

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి, ఉపాధి కూలీలకు దక్కకుండా చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూలీలపై ఉందని వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న తెలిపారు. గురువారం మండలంలోని జాలమంచి గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడారు. రెండు పూటల పని విధానాన్ని రద్దు చేయాలని, ఆన్‌లైన్‌ మస్టర్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పాత పద్ధతిలోనే పనులు కొనసాగించాలని, పని దగ్గర నీళ్లు, నీడ, టెంటు, మెడికల్‌ కిట్లులాంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమ్మర్‌ అలవెన్స్‌ 50 శాతం ఇవ్వాలని, గడ్డపార సాన పెట్టుకోవడానికి రూ.50, రూ.600 వేతనం, 200 రోజులు పని దినాలు కల్పించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకు ఈనెల 22న కలెక్టరేట్‌ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. కోసిగి (రూరల్‌) మండలంలోని దొడ్డి బెళగల్‌ గ్రామంలో ఉపాధి పనులను పరిశీలించి, ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు సంఘం, సిఐటియు నాయకులు రాముడు, వీరేష్‌ మాట్లాడారు. ఈనెల 22న కలెక్టరేట్‌ వద్ద చేపట్టే ధర్నాలో ఉపాధి కూలీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.