ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న వ్యకాస నాయకులు
ప్రజాశక్తి-ఆదోనిరూరల్
వేసవిలో పని ప్రదేశాల్లో ఉపాధి కూలీలకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వ్యకాస మండల అధ్యక్ష, కార్యదర్శులు జి.రంగనాథ్, డి.రామాంజనేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు ఉపాధి కూలీలతో మాట్లాడారు. ఎర్రని ఎండల్లో సైతం పనిచేస్తున్న ఉపాధి కూలీలకు తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స కిట్లు ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టానికి అనేక సవరణలు చేస్తూ తూట్లు పొడిచేందుకు మార్పులు తీసుకొస్తునాయని తెలిపారు. ప్రజలను ఉపాధి చట్టం నుంచి దూరం చేసే కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. ఉపాధి కూలీలకు రోజుకు రూ.600 వేతనం, 200 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలు అయ్యన్న, హనుమంతు, లక్ష్మమ్మ, రంగమ్మ పాల్గొన్నారు.










