Dec 06,2022 00:03

ధర్నా చేస్తున్న గిరిజన సంఘం నాయకులు, ఉపాధి కూలీలు

ప్రజాశక్తి మారేడుమిల్లి
ఉపాధి కూలీలకు మూడు నెలల నుండి బకాయి ఉన్న వేతనాలు చెల్లించాలని కోరుతూ సోమవారం గిరిజన సంఘం ఆధ్వర్యాన ఎంపిడిఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపిడిఒ వీర కిశోర్‌కు వినతిపత్రం అందజేశారు. దీనికి ముందు మండలంలోని ప్రధాన కూడలి నుంచి ఎంపిడిఒ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈతపల్లి సిరిమల్లి రెడ్డి, ఉపాధ్యక్షులు పులి సంతోష్‌ మాట్లాడుతూ బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, ఉపాధి కూలీలకు రోజు కూలి రూ.600 ఇవ్వాలని, ప్రతి గ్రామంలో పనిని గుర్తించాలని, తట్ట బుట్ట గడ్డపారలకు ఛార్జీలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వారానికి ఒకసారి పేమెంట్స్‌ చెల్లించాలని, కూలీల పే స్లిప్పులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు తీగల శ్రీనివాస్‌, మారేడుమిల్లి మండల అధ్యక్షులు ధర్మారెడ్డి, సర్పంచ్‌ మల్లీశ్వరి, ఈతపల్లి సత్యనారాయణ, వెంకట లక్ష్మి, గంగిరెడ్డి ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.