Aug 22,2023 21:35

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు

'ఉపాధి' కూలీల డబ్బులు విడుదల చేయాలి
ప్రజాశక్తి-అనంతసాగరం : మండలంలో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు కేంద్ర ప్రభుత్వం కూలి డబ్బులను వెంటనే విడుదల చేయాలని మంగళవారం సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంపిడిఒకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి అన్వర్‌ బాషా మాట్లాడుతూ గత రెండు నెలల నుండి ఉపాధి పని చేసిన కూలీలకు డబ్బులు మంజూరు చేయలేదని అనేకమంది పేదవారు ఉపాధి హామీ పనులతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు.
ఇంతవరకు పనిచేసిన కూలీల డబ్బులు విడుదల చేయకుండా పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతున్నారన్నారు. ఈ పథకం వల్ల అనేకమందికి జీవనోపాధి దొరికిందని, అనేక పోరాటాల ఫలితంగా ఉపాధి హామీ చట్టం వచ్చిందని, ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కూలీలలో ఈ పథకంపై తప్పుడు భావన కలిగించి పథకాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని విమర్శించారు. ఉపాధి కూలీలకు సక్రమంగా కూలీ డబ్బులు మంజూరు చేయడం లేదని, పని చేసిన వారంలోనే కూలీలకు డబ్బులు జమ చేయాలని చట్టం చెబుతున్నా.. కేంద్ర ప్రభుత్వం వెంటనే కూలీలకు రావలసిన అనేక వారాల కూలీల డబ్బులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగులూరు వెంకటేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సుకూర్‌, సమద్‌, ఖాదర్‌ వలీ, రసూల్‌, ఇస్మాయిల్‌, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.