Aug 23,2023 22:05

         దెందులూరు:ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సమగ్రదర్యాప్తు చేసి, అవినీతికి పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. బుధవారం ఎంపిడిఒ కార్యాలయంలో ఎఒకు వినతిని అందించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కూలీల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని కోరారు. కూలీలకు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ చట్టంలో తీసుకొచ్చిన కొత్తమార్పుల వల్ల కూలీలు, మేట్లు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల నుండి ఐదు వారాల వేతనాలు పడక కూలీలు అప్పుల పాలయ్యారని తెలిపారు. కూలీలకు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇవ్వాల్సిన వేతనం కనీసం రూ.272 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు చేస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరపాల న్నారు. మేట్ల వ్యవస్థను పునరుద్ధరించాలని కోరారు. పని అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు పి.ఆనందరావు, జాన్‌రాజు, మణి, లక్ష్మి, నాగేంద్ర పాల్గొన్నారు.