ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని పెదతీనార్ల గ్రామానికి చెందిన ఉపాధి కూలీ మేరుగు నూకమ్మ గుండెపోటుతో మృతి చెందింది. గ్రామంలో కొండపై ఉపాధి పనులు జరుగుతున్నాయి. శనివారం ఉదయం నూకమ్మ తోటి ఉపాధి కూలీలతో కలిసి పని చేసేందుకు కొండపైకి వెళ్ళింది. పని ప్రారంభించిన కొద్దిసేపటికే ఆమె పనిచేసే చోట కుప్ప కూ లిపోయింది. వెంటనే తోటి కూలీలు సపర్యలు చేపట్టి ,స్థానిక ఎంపీటీసీ సభ్యులు ఎం.నాగేశ్వరరావుకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటినా ఆయన 108కు ఫోన్ చేసి సమాచారం అందించి కొండపైకి వెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు ఎంపీటీసీ సభ్యులు నాగేశ్వరరావు స్థానిక విలేకరులకు తెలిపారు. తోటి కూలీలంతా నూకమ్మ మృతదేహాన్ని కొండపై నుండి కిందకు తీసుకువచ్చారు. మృతురాలికి కుమారుడు ఉన్నాడు. భర్త గతంలో మృతి చెందినట్లు కూలీలు తెలిపారు. సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశామని ఎంపీటీసీ తెలిపారు.










