నిరుద్యోగ భయం మన దేశాన్ని వెంటాడుతోంది. కోవిడ్ మహమ్మారి విజృంభణ, తొందరపాటు లాక్‌డౌన్ నిర్ణయం అనంతరం...పారిశ్రామిక, చిన్న తరహా వ్యాపారాలు, సేవా రంగం, ప్రధానంగా అసంఘటిత రంగంలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కోవిడ్ లాక్‌డౌన్ విధించే ముందు కూడా దేశంలో నిరుద్యోగం పెరుగుదల విపరీతంగా ఉంది. చిన్నతరహా ఉత్పత్తిదారులు, పరిశ్రమలపై పెద్ద నోట్ల రద్దుతో పాటు వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) అమలు ప్రభావం తీవ్రంగా పడింది. తద్వారా నిరుద్యోగిత భారీ స్థాయిలో పెరిగిపోయింది. ప్రభుత్వం దాచిపెట్టాలని ప్రయత్నించిన 2017-18 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్‌ఎఫ్)... దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగిపోయిందని, ఇలా గత అయిదు దశాబ్దాల్లో ఎన్నడూ జరగలేదని పేర్కొంది. 2018-19 పిఎల్‌ఎఫ్ సర్వే కూడా ఇదే చిత్రాన్ని చూపించింది.
నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) 2019లో ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తేలిన గణాంకాలు చాలా భయంకరంగా ఉన్నాయి. 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్కులలో కేవలం 67 శాతం గ్రామీణ పురుషులు, 21 శాతం గ్రామీణ మహిళలు, 71 శాతం పట్టణ పురుషులు, 19 శాతం పట్టణ మహిళలు మాత్రమే వేతనాలు వచ్చే పనిలో పాల్గొంటున్నారు. ఈ ఏడాది మార్చిలో విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి పరిస్థితులు మరింత దిగజారాయి. లాక్‌డౌన్ ఎత్తేసి, కొన్ని ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించినప్పటికీ కోల్పోయిన ఉద్యోగాలను తిరిగి తెప్పించలేకపోయింది. ప్రస్తుత ఉద్యోగిత స్థాయి కరోనా ముందు నాటి పరిస్థితుల కంటే అధమంగా ఉంది.
ఉపాధి పరిస్థితులపై ప్రయివేట్ సర్వే సంస్థ 'సిఎంఐఈ' ఒక జాతీయ సర్వే నిర్వహించింది. సిఎంఐఈ సర్వే కోసం ఉపయోగించిన శాంపిల్‌లో అసంఘటిత రంగానికి చెందిన ప్రాతినిధ్యం చాలా తక్కువ. దీని ఫలితంగా ఈ సర్వే నిరుద్యోగ సమస్యను సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో పాటు లాక్‌డౌన్ అనంతరం ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అధిక అంచనాలు వేసింది. అయినప్పటికీ, అక్టోబర్ నెలలో గ్రామీణ నిరుద్యోగం 6.9 శాతంగా, జాతీయ నిరుద్యోగం 6.89 శాతం ఉందని సిఎంఐఈ తన తాజా నెలవారీ గణాంకాల్లో తెలిపింది. ఉపాధి హామీ పథకం ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కింద కల్పించే పని దినాల సంఖ్యలో కూడా తగ్గుదల కన్పిస్తోంది. సెప్టెంబర్ నెలలో 26.5 కోట్ల పని దినాలు కల్పించగా, ఈ సంఖ్య అక్టోబర్ నెలకు 17.3 కోట్లకు పడిపోయింది.
దేశంలోని లక్షలాది కుటుంబాల కష్టాలను ఈ నిరుద్యోగ విస్తృతి మరింత పెంచుతోంది. సరైన ఆదాయం లేక తగిన వైద్యం కూడా పొందలేని పరిస్థితుల్లో అనేక కుటుంబాలు ఉన్నాయి. ఇదే సమయంలో చిన్నారులను పాఠశాలలకు పంపలేక, కుటుంబానికి అవసరమైన ఆహారంపై వ్యయం కూడా చేయలేకపోతూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎన్‌సిఆర్‌బి గణాంకాల ప్రకారం. 2019లో రోజువారీ కూలీల ఆత్యహత్యల రేటు కూడా పెరిగింది. 2020లో ఈ ఉద్యోగ నష్టాలు సమస్యలను మరింత తీవ్రతరం చేశాయి.
కేంద్రం ఇటువంటి తీవ్రమైన సమస్యను పట్టించుకోకుంటూ నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన కొద్దిపాటి ఆర్థిక ఉద్దీపన చర్యలు కూడా జీవనోపాధి పునరుద్ధరణ, ఉద్యోగ కల్పనకు బంధనాలు వేశాయి. జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఆదాయ మద్దతుగా ఉండేందుకు నగదు బదిలీ కల్పించడంలో మోడీ సర్కార్ ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వ, ప్రభుత్వ తరహా సంస్థల్లో (క్వాషీ గవర్నమెంట్ బాడీస్) ఉన్న లక్షలాది ఉద్యోగ ఖాళీలను సర్కార్ భర్తీ చేయడం లేదు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో ఉద్యోగ ప్రాధాన్యత తేటతెల్లమైంది. మహా ఘట్‌బంధన్ కూటమి ఇచ్చిన '10 లక్షల ఉద్యోగాల కల్పన' హామీకి ప్రధానంగా యువత నుంచి, కుల మతాలకు అతీతంగా భారీ స్పందన వచ్చింది. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా...బీహార్ ఎన్నికల ప్రచార తీరు ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. అందువలన నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం అత్యవసరం. ఉపాధి ఉద్యమంలో యువతది కీలక పాత్ర. ఏదేమైనా ఇది విస్తృతమైన సమస్య కాబట్టి, ఇది కార్మిక లోకంతో పాటు విద్యార్థి, మహిళా సంఘాలు చేపట్టే ఉద్యమంలో భాగం కావాలి. నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న వారిలో అధిక శాతం మంది కార్మిక వర్గానికి చెందిన వారేనన్న విషయం గుర్తుంచుకోవాలి. నిరుద్యోగ భూతంపై పోరాటానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కార్మికులందరూ సంఘటితం కావాలి. ఉపాధి కోసం పోరాటం ప్రధానంగా మహిళలకు సంబంధించినది, ఎందుకంటే మహిళల్లోనే ఎక్కువ శాతం మంది ఉపాధికి దూరంగా ఉన్నారు. నిరుద్యోగ సంక్షోభం కారణంగా చదువుకున్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. ఇటువంటి సమయంలో ఉపాధి కోసం పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలి.
నిరుద్యోగులకు భత్యం, పన్ను చెల్లింపు శ్లాబ్‌లో లేనివారికి నెలకు రూ.7,500 నగదు బదిలీ ద్వారా ఆదాయ మద్దతు ఇవ్వాలని, పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ లో తగిన వేతనాలతో ఏడాదికి 200 పని దినాలు కల్పించాలని, భారీ ఆహార నిల్వల దృష్ట్యా నవంబర్ నెల తర్వాత కూడా ఆహార ధాన్యాల ఉచిత పంపిణీ చేయాలన్న డిమాండ్లే ప్రధాన లక్ష్యంగా ఈ ఐక్య పోరాటం ఉండాలి. ఉపాధిని సృష్టించేందుకు వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న నిరుద్యోగ సంక్షోభ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పలు విభాగాలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలి.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)










