Aug 21,2020 07:45

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రధానంగా పట్టణ ప్రాంతాల ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఉపాధి కోసం గ్రామీణ ప్రజలు పట్టణాల బాట పట్టడంతో అక్కడ జనాభా పెరిగింది. మరీ ముఖ్యంగా మురికివాడలలో ఇరుకు ఇళ్ళలోనే ఎక్కువగా నివశిస్తున్నారు. ఇప్పుడు కరోనా బారిన పడుతున్న వారిలో అత్యధికులు మురికి వాడల్లోని వారే. ఏలూరులో 9 వేల మందికి పైగా కరోనా సోకితే, దానిలో 8 వేల మంది మురికివాడల్లో నివశించే వారే. పట్టణ ప్రజలు ఒకవైపు కరోనా వ్యాధితో పోరాడుతూ రెండవ వైపున తమ ఉపాధి కోసం బతుకు పోరాటం చేయవలసి వస్తోంది.
లాక్‌డౌన్‌ సడలింపుల పేరుతో ప్రభుత్వాలు ముందుగా మద్యం షాపులు తెరిచేశాయి. ఏలూరులో ఉపాధి కోల్పోయిన జూట్‌ మిల్లు, భవన నిర్మాణ కార్మికులు చాలామంది ఆ దుకాణాల ముందు చాంతాడంత క్యూలైన్లలో నిలబడి మద్యం సీసాలు కొని...వాటిని ఇళ్ళ దగ్గర అమ్ముకోవడం ద్వారా తాత్కాలిక ఆదాయాలు పొందారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసిన టీచర్లు ఉపాధి హామీ పనులకు వెళ్లి కుటుంబాలను నెట్టుకొచ్చారు. జూట్‌ మిల్లులు, షాపుల్లో పని చేసిన మహిళలు ఉపాధి కోల్పోయి ఇళ్లలో పాచి పనులు చేశారు. ఆటో కార్మికులు కిరాయిలు లేక ఆటోల్లో మొక్కజొన్న పొత్తులు అమ్ముకున్నారు. బ్యాంకుల్లో ఇంటి రుణాలు తీసుకున్నవారు వాయిదాలు చెల్లించకపోతే అదనపు వడ్డీ వసూలు చేస్తామని...అధికారులు ఫోన్‌ చేసి మరీ హెచ్చరించారు. దీంతో అప్పులు చేసి లోను వాయిదాలు చెల్లించారు. ఇంటి అవసరాలకు బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి ఇ.ఎం.ఐ స్కీములలో వస్తువులను కొన్నవాటికి వాయిదాలు కట్టవద్దని ప్రభుత్వాలు చెప్పినా, ఆయా కంపెనీలు ముక్కు పిండి ఖాతాదారుల బ్యాంకు ఖాతాల నుండి యథావిధిగా ప్రైవేటు కంపెనీలు డబ్బులు వసూలు చేశాయి. ఎకౌంట్లలో డబ్బులు లేని ఖాతాదారులకు పెనాల్టీలు వేశారు. మోటారు వాహనాలు ఫైనాన్స్‌ కంపెనీలయితే లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన నాటి నుండి 'డబ్బులు కడతారా చస్తారా' అని పీకల మీద కూర్చున్నాయి. నెలవారీ ఆదాయాలు లేకపోవడంతో అప్పులు కూడా పుట్టని పరిస్థితిని ప్రజలు ఈ కరోనా వల్ల ఎదుర్కొంటున్నారు.
ఉద్యోగులు, కార్మికులు, చిరువ్యాపారుల కష్టాలు
ఏలూరులో షాపులు, షాపింగ్‌ మాల్స్‌లో దాదాపు 8 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. వీటిలో అత్యధిక శాతం మాల్స్‌ లోని కార్మికులు 4నెలల పాటు ఉపాధిని కోల్పోయారు. జీతాలు లేవు. ప్రస్తుతం వ్యాపారాలు తగ్గిపోయాయంటూ మూడవ వంతు సిబ్బందిని తొలగించారు. వేలాది ఆటో కార్మికులు లాక్‌డౌన్‌ వల్ల 3 నెలలు పాటు పూర్తిగా ఆదాయాలు కోల్పోయారు. లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చినా ఆటోలో ఇద్దరికి మించి ఎక్కించుకొనే పరిస్థితి లేకపోడంతో ఆదాయాలు లేవు. దీనికితోడు లాక్‌డౌన్‌ కాలంలో నెల రోజుల పాటు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పెంచిన డీజిల్‌ ధరలు, రాష్ట్రంలో పెంచిన వ్యాట్‌తో ఆటో కార్మికుడి పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఆటోలు నడపలేరు. నడపకుండా ఉండలేని ఒక విచిత్ర పరిస్థితి. ఫైనాన్స్‌లో ఆటోలు తీసుకున్న వారికి కుటుంబాలు నడపడం, ఫైనాన్స్‌ కంపెనీలకు వాయిదాలు చెల్లించడం తలకు మించిన భారం అయ్యింది. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి మరీ అన్యాయం. కరోనా ముందు నుండే ఉపాధి లేదు. రాష్ట్రంలో వై.ఎస్‌.ఆర్‌.సి.పి ప్రభుత్వం చేపట్టిన ఇసుక పాలసీ పుణ్యమా అని భవన నిర్మాణ పనులు లేకుండా పోవడంతో కార్మికులు కష్టాల్లో పడ్డారు. ఏలూరులో 3 వేల మంది సండే మార్కెట్‌ వ్యాపారులు వారంలో ఒక్క రోజు చేసుకున్న వ్యాపారంతో మిగిలిన రోజులు కుటుంబాలు గడుపుకోవాలి. లాక్‌డౌన్‌ తీసేసినా ఆదివారాలు కర్ఫ్యూ పెట్టడంతో వారి పరిస్థితి దినదిన గండంగా ఉంది.
ఈ రకంగా చెప్పుకుంటూపోతే ఒకరేమిటి 23 రకాల పనులు చేసే సంఘటిత, అసంఘటిత కార్మికులు 51 వేల మంది ఉపాధిని కోల్పోయారు. వీరికి తోడు మరో 15 రకాల ఇతర కార్మికులు, కళాకారులు, పలు చేతివృత్తులు, స్వయం ఉపాధి చేసుకొనే 20,000 మంది వరకు ఉపాధి కోల్పోయారు. మొత్తం 71 వేల మంది. ఈ కుటుంబాలలో ఒక ఇంట్లో ఇద్దరు పని చేసే వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే...71 వేలలో కనీసం సగం మందయినా ఉంటారు. అంటే 35 వేలు అవుతారు. మొత్తం ఒక లక్షా ఐదు వేల మందికి పైగా ప్రజలు శాశ్వతంగానో, పాక్షికంగానో ఉపాధిని కోల్పోయారు. ఇది ఏలూరు జనాభాలో 30 శాతం పైనే. వీరి కుటుంబాల మొత్తం జనాభాను చూస్తే చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి లేక ఆర్థికంగా నష్టపోయారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి కోల్పోవడమంటే రాబోయే కాలంలో నగరంలో వ్యాపార రంగంపై ఆర్థికంగా పెను ప్రభావం పడుతుంది.
ఏడాదిపాటు కోలుకోలేమంటున్న ప్రజలు
లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్న కొద్ది పాటి పనులకు వెళ్తున్నా...ఈ 4 నెలల్లో చేసిన అప్పులు పేద, మధ్య తరగతి వారికి తలకు మించిన భారం అయ్యాయి. ఏదైనా రోగం వస్తే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇదివరకటిలా వెంటనే చూడడం లేదు. ఒకవేళ కొద్దిపాటి ఆసుపత్రులలో వెంటనే వైద్యం చేస్తున్నా అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. మీ పిల్లలు విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉండాలంటే ఆన్‌లైన్‌ క్లాసులు వినాలని, దానికి అదనంగా ఫీజులు చెల్లించాలంటూ ప్రైవేటు విద్యా సంస్థలు, కార్పొరేట్‌ స్కూళ్లు ఒత్తిడి తెస్తున్నాయి. మరో పక్కన నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో పేద, మధ్య తరగతి ప్రజల బతుకులు తలకిందులై ఏడాది పాటు కోలుకోలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని పాలకులు
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం...బ్యాంకులకు ఎగనామం పెట్టిన విజరు మాల్యా వంటి దోపిడిదారులకు బిజెపి ప్రభుత్వం రూ.68 వేల కోట్ల రుణ మాఫీ చేసింది. రిలయన్స్‌ అంబానీలకు రైల్వేను అప్పగిస్తోంది. కానీ కరోనా వల్ల ఆర్థికంగా నష్టపోయిన ప్రజలను, ఉపాధి పోయిన కార్మికులను ఆదుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆటో కార్మికులు, మరికొందరికి ఎన్నికల వాగ్దానంలో భాగంగా రూ.10 వేలు అందించినా 4 నెలలకు అవి ఏమూలకూ రాలేదు. ఇంకా అటువంటి పరిహారం అందని కార్మికులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల భవన నిర్మాణ కార్మికులు సంవత్సరం పాటు ఉపాధి పోగొట్టుకొని రోడ్డున పడ్డా పట్టించుకున్న పాపాన పోలేదు. బిల్డింగ్‌ కార్మికులకు చెందిన వెల్ఫేర్‌ బోర్డు నుండి రూ.10 వేలు చొప్పున ఇవ్వమని సంవత్సరం నుండి మొత్తుకొంటున్నా చెవిటోడి ముందు శంఖం ఊదిన చందంగా వుంది ప్రభుత్వ వ్యవహారం. అందుకే రాష్ట్రంలో ఉపాధి కోల్పోయిన అన్ని తరగతుల వారికి రూ.10 వేలు చొప్పున చెల్లించి ఆదుకోవాలి. అంతేకాక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, లోటు బడ్జెట్‌ నిధులు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, విశాఖ రైల్వే జోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ...ఇలా అనేక విధాలుగా మనకు నిధులివ్వాల్సి వుంది. వాటిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదియ్యాలి. ఇటువంటి సమయంలో ఆదాయ పన్ను పరిధిలో లేని కుటుంబాలకు నెలకు రూ. 7,500 నగదు, మనిషికి పది కేజీల ఆహార ధాన్యాలు ఆరు నెలల పాటు ఇవ్వాలని, ఉపాధి కోల్పోయిన పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని సిపిఎం వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేయడం ఎంతైనా సముచితం. దానికి మద్దతు తెలిపి, ఆ నిరసనల్లో పాలు పంచుకోవడం ప్రజల కర్తవ్యం.
                                                                                                                          * పి. కిషోర్‌ (సిపిఎం ఏలూరు టౌన్‌ కార్యదర్శి)