* పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యాన నిరసన
ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్: నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు టి.తిరుపతిరావు విమర్శించారు. అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలిస్తామని చెప్పిన మోడీ.. ఎక్కడ ఉద్యోగాలిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని ఎన్‌జిఒ హోం వద్ద నిరుద్యోగ వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో కోట్లాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా సరే భర్తిచేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ఉన్న ఉద్యోగాలతో పాటు ప్రభుత్వరంగ సంస్థలను ప్రధాని మోడీ తెగనమ్ముతు న్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 1.50 లక్షల చిన్న, మధ్యతరగతి, భారీ పరిశ్రమలు మూత పడ్డాయని గుర్తుచేశారు. సిఎం జగన్మోహన్‌రెడ్డి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో వైఫల్యం చెందారన్నారు. ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్.ఎర్రయ్య, జి.మౌలి, ఎస్.మురళీ, జి.అప్పలనాయుడు, ఎస్.నరేష్, కన్నబాబు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.










