
ప్రజాశక్తి - నల్లజర్ల రాష్ట్రంలో రైతుకు గిట్టుబాటు ధర, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతుందని వ్యవసాయ శాఖామంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మండలంలోని అయ్యవరంలో రూ.550 కోట్లతో నిర్మించే ఆయిల్ ఫామ్ పరిశ్రమకు బుధవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ రైతుకు గిట్టుబాటు ధర, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రాష్ట్రంలో రైతులకు సిఎం జగన్ అనేక పథకాలు అందించారనిని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల దృష్టిలో ఉంచుకుని వినియోగదారులపై నూనె ధరలు భారం పడకుండా ఉండేందుకు ఇతర దేశాల నుంచి దిగుమతి సుంకం తీసివేయడం ద్వారా 50 శాతం ఆయిల్ మన దేశానికి దిగుమతి అవుతుందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. దీనిపై కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. 3ఎఫ్, ఆయిల్ ఫామ్ ఛైర్మన్ సంజరు గోయింకా, ఎంపి కె.శ్రీధర్, ఎంఎల్‌ఎలు తలారి వెంకట్రావు, అబ్బాయి చౌదరి, ఆయిల్ ఫెడ్ ఏపీ ఆయిల్ ఫెడ్ ఎండి చావల బాబురావు సర్పంచ్ జి.వీరాస్వామి పాల్గొన్నారు.