Aug 27,2023 21:13

జిల్లా ఉపాధి కల్పన అధికారిణి దీప్తి

ఉపాధి కల్పనే ధ్యేయం
- ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు కెరియర్‌ గైడెన్స్‌
- ప్రజాశక్తితో జిల్లా ఉపాధి కల్పన అధికారిణి దీప్తి
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్‌

     నిరుద్యోగులకు ఉపాధి కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నామని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి దీప్తి పేర్కొన్నారు. తమ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న నిరుద్యోగులు అందరికీ జాబ్‌ మేళాలో నిర్వహించే పలు సంస్థల్లో ఉద్యోగ నియామకాలను పొందేలా చూస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని త్వరలో ఐటీ ల్యాబ్‌ కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజాశక్తితో ఆమె ముఖాముఖిగా మాట్లాడారు...
జిల్లాలో నిరుద్యోగ యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు?
జిల్లా ఉపాధి కల్పన అధికారిణి : జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం పరిధిలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నాము. ఎపి స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌, సిడాప్‌ సంయుక్తంగా జాబ్‌ మేళాలో నిర్వహించి పలు ప్రైవేటు సంస్థల ఉద్యోగ నియామకాలను కల్పించడం జరుగుతుంది. ఇక నుండి తమ దగ్గర రిజిస్ట్రేషన్‌ చేసుకున్నటువంటి నిరుద్యోగుల వివరాలను నేషనల్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ నందు నమోదు చేయడం జరుగుతుంది. ఇక ప్రైవేటు సంస్థలు కూడా నేరుగా జాబ్‌ మేళాలో పాల్గొని నిరుద్యోగ అభ్యర్థులను ఎంపిక చేసుకునేలా చర్యలు తీసుకోనున్నాము.
జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని జాబ్‌ మేళాలు నిర్వహించారు?
జిల్లా ఉపాధి కల్పన అధికారిణి : ఉమ్మడి జిల్లాలో ప్రతి నెలలో ఒక మెగా జాబ్‌ మేళా, నాలుగు జాబ్‌ మేళాలు నిర్వహించాము. అనేకమందికి ఉద్యోగ నియామకాలను పలు ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఇప్పటికే ఏప్రిల్‌ మాసం నుండి జూన్‌ వరకు పలు నియోజకవర్గ కేంద్రాల్లో జాబ్‌ మేళా కార్యక్రమాలను నిర్వహించి వారికి ఉద్యోగ నియామకాలను చేపట్టాము.
జిల్లాలో స్థానికంగా ఉన్నటువంటి సంస్థల్లో నిరుద్యోగులకు ఎందుకు అవకాశాలు కల్పించలేకపోతున్నారు?
జిల్లా ఉపాధి కల్పన అధికారిణి : స్థానికంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను గుర్తించి వారి సంస్థల్లో అవసరమైనటువంటి ఉద్యోగ నియామకాలను చేపట్టేలా ప్రతినెల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. స్థానిక సంస్థల్లో కూడా ఉద్యోగాలు పొందేలా దృష్టి పెట్టాం.
ఇంటర్‌, డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు కెరియర్‌ గైడెన్స్‌ లాంటివి ఏమైనా విద్యార్థులకు ఇస్తున్నారా?
జిల్లా ఉపాధి కల్పన అధికారిణి : ఇప్పుడు జిల్లాలోని టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ చదివే విద్యార్థులందరికీ కెరియర్‌ గైడెన్స్‌పై అవగాహన కల్పిస్తున్నాం. విద్యార్థులు తమ చదువులను పూర్తి చేసుకున్న తర్వాత తమ కెరియర్‌ ఉజ్వలంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఇప్పటికే అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించాం.