రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పారిశ్రామిక విధానం 2020-23 ప్రకటించింది. రాష్ట్ర క్యాబినెట్ దీనిని ఆమోదించింది. ఈ విధాన ప్రకటన ముందు మాటలో ముఖ్యమంత్రి గారు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలు, సామాజిక తరగతుల అభివృద్ధికి ఉపయోగపడేలా నూతన విధానాన్ని రూపొందించామని ప్రకటించారు. ఈ ప్రకటన యువతకు ఉపాధి కల్పన, జాతీయ సగటుతో సమానంగా తలసరి అదనపు విలువ, వివిధ ప్రాంతాలు, తరగతుల మధ్య సమతుల్య అభివృద్ధి, పర్యావరణహిత స్థిరమైన అభివృద్ధిని సాధించడమనే నాలుగు అంశాలను లక్ష్యంగా పేర్కొంది.
రాష్ట్రంలో మౌలిక వసతులుగా 1,32,415 కిలోమీటర్ల రోడ్లు, 974 కిలోమీటర్ల సముద్ర తీరం, ఆరు పోర్టులు, 3703 కిలోమీటర్ల రైలు మార్గం, ఆరు విమానాశ్రయాలు, భోగాపురంలో వచ్చే అంతర్జాతీయ విమానాశ్రయం, 24,800 మెగావాట్ల విద్యుత్, 108 బిసిఎం ల నీరుతో పాటు నిపుణులైన శ్రామికులున్నారని ఈ విధాన ప్రకటనలో పేర్కొన్నారు.
పది సర్వీసులను ఒకేచోట అందించే 'వైఎస్‌ఆర్ ఎ.పి వన్' అనే సెంటరును ఏర్పాటు చేసి ఎటువంటి ఆలస్యం, అవినీతి లేకుండా అనుమతులు మంజూరు చేస్తామని, పారిశ్రామిక వాడలకు రోడ్లు, నీరు, విద్యుత్ వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు పన్ను రాయితీలిస్తామని, రాష్ట్ర జిఎస్‌టి ని ఐదు సంవత్సరాలు భర్తీ చేస్తామని తెలిపారు. అన్నింటికి మించి భూమి కేటాయింపును ప్రస్తుతమున్న లీజు మరియు కొనుక్కోవడం స్థానంలో లీజుతో పాటు కొనుక్కోవడం అనే విధానాన్ని ప్రకటించారు. ఈ చర్యల ద్వారా సులభతర వాణిజ్యం సాధ్యమై పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
ఈ ప్రకటనలో పభుత్వం పేర్కొన్న మౌలిక వసతులు గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవే. అందువల్ల ప్రభుత్వం ఏదైనా చేయాలంటే అది ప్రస్తుత పారిశ్రామిక రంగ సమస్యలను పరిశీలించి, వాటిని పరిష్కరించే చర్యలు చేపట్టాలి. నేడు ఈ రంగం నుండి వస్తున్న పెద్ద సమస్యలుగా పారిశ్రామిక ప్రమాదాలు, కాలుష్యం ఈ కోవిడ్ కాలంలో కూడా చూస్తున్నాం. వీటి పరిష్కారానికి ప్రభుత్వం ఈ విధాన ప్రకటనలో కనీస ప్రస్తావన కూడా చేయలేదు. నేడు అత్యధిక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు రోడ్లు, విద్యుత్, నీరు వంటివి లేకపోవడం కాదు. ఈ పరిశ్రమల ఉత్పత్తులకు మార్కెట్ లేకపోవడం. దీని గురించి ఈ విధానంలో ఎక్కడా ప్రస్తావనే లేదు. అందువల్ల సహజంగానే పరిష్కరించే ప్రతిపాదనలు కూడా ఏమీ లేవు.
మార్కెట్ పెరగాలంటే మొదటి లక్ష్యమైన యువతకు ఉపాధి అవకాశాలు, తద్వారా కొనుగోలుశక్తి పెరగడం ద్వారానే సాధ్యం. నేడు ఎంతమంది యువతకు ఉపాధి కల్పించడానికి ఈ విధానం ఉద్దేశించబడిందో ఎక్కడా పేర్కొనలేదు. ప్రకృతి వనరులను సక్రమంగా వినియోగించుకుంటే పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. 974 కిలోమీటరర్ల సముద్ర తీరం ద్వారా పోర్టులు నిర్మించవచ్చని చెప్పారు కాని, అదే సముద్రం ద్వారా లక్షలాది మంది మత్స్యకారులకు ఉపాధి కల్పించే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం గురించి లేదు. సముద్ర జలాల కాలుష్య నివారణ ప్రస్తావనే లేదు. మన రాష్ట్రంలో 37,221 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉంది. అక్కడ సహజసిద్ధంగా దొరికే ఉత్పత్తులతో 1/70 చట్టానికి లోబడి గిరిజన యువతకు ప్రోత్సాహకాలిచ్చి ప్రోసెసింగ్ పరిశ్రమలు పెట్టిస్తే లక్షలాది మందికి ఉపాధి లభ్యమవుతుంది. కాని దురదృష్టకరంగా వీటిలో ఏ ఒక్క ప్రస్తావనా ఈ విధానంలో పొందుపరచలేదు.
దాదాపు అన్ని జిల్లాలలోనూ వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనకు అవకాశాలు వున్నాయని ఇందులో తెలిపారు. కాని ఆశ్చర్యకరంగా ఈ కోవకు చెందిన జ్యూట్, పంచదార, పాల డెయిరీ, నూనె, స్పిన్నింగ్ వంటి అనేక ప్రైవేటు, సహకార రంగ పరిశ్రమలు మూతబడి ఉన్నాయి. వాటిని తిరిగి తెరిపించడానికి ప్రయత్నించకుండా కొత్తవి స్థాపిస్తామనడంలో అర్ధమే లేదు.
నూతనంగా పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తామని, అవసరమైన భూమి కేటాయిస్తామని ఇందులో పేర్కొన్నారు. కాని, ఇప్పటికే ఉన్న అనేక పారిశ్రామిక వాడలలో నిరుపయోగంగా ఉన్న భూములను స్వాధీనం చేసుకోకుండా మరలా భూమి కేటాయించడమంటే భూపందేరం తప్ప మరొకటి కాదు. పారిశ్రామిక అవసరాల పేరుతో రాష్ట్ర విభజన తరువాత దాదాపు 22 లక్షల ఎకరాల భూమి రైతుల నుండి సేకరించారు. అందులో నామమాత్రంగా కూడా పరిశ్రమల స్థాపన జరగలేదు. కొంత మంది పారిశ్రామిక వేత్తలు ఆ భూమిని బ్యాంకులలో తనఖా పెట్టి రుణాలు తీసుకుని ఎగ్గొట్టేస్తున్నారు. ప్రభుత్వం ఆ భూమినేం చేస్తుంది? ఈ భూములిచ్చిన రైతుల పరిస్థితి అటు భూమీ పోయి-ఇటు ఉపాధీ లభించక రెంటికీ చెడ్డ రేవడిలా తయారయింది. వీరికి ప్రభుత్వం ఎలా న్యాయం చేస్తుంది? వంటి ప్రశ్నలకు సమాధానమేదీ ఈ పత్రంలో కనపడదు.
మరో ప్రధాన అంశమేమిటంటే, అసలు ఉత్పత్తి జరగాలంటే పెట్టుబడి-కార్మికుల శ్రమ రెండూ తప్పనిసరిగా ఉండాలి. ఈ విధాన పత్రంలో పెట్టుబడికి ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటించారు కాని కార్మికుల గురించి కనీస ప్రస్తావన కూడా చేయలేదు. ఈ విధాన ప్రకటన తయారీలో సంబంధిత తరగతులందరినీ సంప్రదించినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి తన ముందుమాటలో పేర్కొన్నారు. అయితే చాలా విచిత్రంగా కీలకమైన కార్మికులతోకానీ, కార్మిక సంఘాలతో కానీ చర్చించిన దాఖలాలేమీ లేవు.
రెండో లక్ష్యంగా తలసరి అదనపు విలువ జాతీయ సగటుతో సమానంగా సాధించడమని పేర్కొన్నారు. అయితే దీనిని చేరుకోవడానికి ప్రతిపాదనలేమీ లేవు. మూడో లక్ష్యంగా వివిధ ప్రాంతాలు, తరగతుల మధ్య సమతుల్య అభివృద్ధిని సాధించేలా వెనుకబడ్డ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ అని పేర్కొన్నారు కాని విధాన ప్రకటనలో ఎక్కడా ఉత్తరాంధ్ర, రాయలసీమల గురించి ప్రత్యేక ప్రతిపాదనలు లేవు. ఎస్సీ, ఎస్టీ, బి.సి, మైనారిటీలు, అందులోనూ ముఖ్యంగా మహిళల పాత్ర పెంచే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే వీరికి ఫలాలు అందే ప్రత్యేక ఏర్పాటు ఏమిటన్నది ఇందులో పేర్కొనలేదు. ఇక నాల్గో లక్ష్యమైన పర్యావరణ హితమైన స్థిరమైన అభివృద్ధి సాధించడం కాలుష్యాన్ని నివారించకుండా ఎలా సాధ్యం? స్థిరమైన అభివృద్ధి అంటే ప్రకృతి వనరులను కొల్లగొట్టుకు పోవడం కాకుండా వాటిని సక్రమంగా వినియోగించుకునేలా పరిశ్రమల స్థాపన. ఇది ఎట్టి పరిస్థితులలోనూ ప్రభుత్వ రంగం ద్వారానే సాధ్యం. అయితే ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రల ఆధునీకరణ కానీ, కొత్తవాటి స్థాపన కానీ, సహకార రంగం గురించికానీ ఇందులో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. ఇవన్నీ చూస్తుంటే, నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకోవడం సంభవమేనా అనే సందేహం కలగక మానదు. అసలు ఈ లక్ష్యాలకు, విధాన ప్రకటనకు మధ్య సమతుల్యత ఉందా, లేక వేటి దారి వాటిదేనా అనే సందేహం కూడా కలగక మానదు.
మొత్తంగా చూస్తే ఈ విధానంలో కొత్తదన మేదీ లేకపోవడమే కాక, గొప్ప లక్ష్యాలుగా పెట్టు కున్న ఉపాధి కల్పన ఎంతమందికి చేస్తామని గానీ, వృద్ధి రేటు ఎంత సాధిస్తామని గానీ లేదు. ఎప్పటి నుండో నలుగుతున్న విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు ఇండిస్టియల్ కారిడార్ల గురించి ప్రస్థావనైతే చేశారు కానీ, వాటిని ఎలా అభివృద్ధి చేస్తారో పేర్కొనలేదు. రెండు నైపు ణ్యాభివృద్ధి యూనివర్సిటీలు, 30 సెంటర్లు కొత్తగా ఏర్పాటు చేస్తామని పేర్కొనారు. అయితే ఈ మొత్తం విధాన ప్రకటనలో ప్రభుత్వం అస్సలు పరిగణన లోనికి తీసుకోని ప్రధాన అంశం ఒకటుంది. అదేమిటంటే, ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో ప్రపంచమంతా సంక్షోభంలోకి నెట్టబడింది. మన దేశం లో ఉత్పాదకరంగం క్షీణదశలో ఉంది. అన్ని రంగాలూ మైనస్ వృద్ధి రేటును ఎదుర్కొంటు న్నాయని ఆర్థిక సంస్థలన్నీ నిత్యం తెలుపుతూనే ఉన్నాయి. ఈ ప్రకటన కాలంలో (2020-23) సైతం ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆర్థికవేత్తలు చెబుతుండగా, దీనిని ఈ ప్రకటన పూర్తిగా విస్మరిం చింది. ఇదేదో మొక్కుబడి ప్రకటనలా ఉంది తప్ప, నిజంగా ఏదో సాధించాలనే దృక్పథంతో రూపొం దించలేదనే అభిప్రాయం నిష్పక్షపాతంగా దీనిని చదివిన వారెవరికైనా ఏర్పడుతుంది. అన్నింటికి మించి ఈ ప్రకటన పుటాక్షరంలో రాష్ట్రాన్ని అవ కాశాల నేలగా (ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్) పేర్కొ న్నారు. కాని సారం దానిని నేలకు అవకాశంగా (ఆపర్చునిటీస్ ఆఫ్ ల్యాండ్) తీర్చిదిద్దింది.
- ఎ. అజ శర్మ,
వ్యాసకర్త ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
ప్రధాన కార్యదర్శి










