ప్రజాశక్తి-విజయనగరం : తనతో పాటు మరో పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగాలని డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.కల్యాణ చక్రవర్తి పిలుపునిచ్చారు. వివిధ సంస్థల ద్వారా తీసుకున్న రుణాలతో స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించి జీవనోపాదులు పెంచుకోవాలని కోరారు. లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో స్థానిక బిసి కాలనీలోని ఎస్‌బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం రుణ వితరణ మహోత్సవం జరిగింది. పీడీ ముఖ్య అతిధిగా హాజరై, లబ్ధిదారులకు రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తీసుకున్న రుణాలను సుమారు 99.7 శాతం తిరిగి చెల్లిస్తుండటంతో, రుణ పరపతి గణనీయంగా పెరిగిందని, ఇప్పుడు ఒక్కో సంఘం రూ.20 లక్షలు వరకు రుణాన్ని పొందే స్థాయికి ఎదిగిందని చెప్పారు. ఈ ఏడాది సుమారు 1100 కోట్ల రూపాయలను బ్యాంకు లింకేజి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మెప్మా పీడీ సుధాకరరావు మాట్లాడుతూ, ఏదో ఒక స్వయం ఉపాధి యూనిట్‌ను స్థాపించడం ద్వారా జీవనోపాది పెంచుకోవాల చెప్పారు. ఎల్‌డిఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ, బ్యాంకు రుణాలు అందరికీ అందాలన్న ఉద్దేశంతో అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం బ్యాంకులు అందిస్తున్న రుణాల్లో సుమారు 20 శాతం మహిళా సంఘాలకే అందుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌బిఐ రీజనల్ మేనేజర్ విజరు సుబ్రమణ్యం, నాబార్డు డిడిఎం నాగార్జున, డిఆర్‌డిఎ ఎపిడి సావిత్రి, పరిశ్రమలశాఖ ఎడి వంశీకృష్ణ, ఆర్‌శెట్టి డైరెక్టర్ రమణ, ఎఎల్‌డిఎం ప్రత్యూష, వివిధ బ్యాంకుల మేనేజర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఎస్‌బిఐ, ఎపిజివిబి, యూనియన్ బ్యాంకుల ద్వారా మెగా చెక్కులను అందజేశారు.










