May 22,2023 23:42

ధర్నాలో మాట్లాడుతున్న శివనాగరాణి

ప్రజాశక్తి-గుంటూరు : ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలని, కూలీలకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని, ఉపాధి హామీకి నిధులు పెంచాలని, పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో సంఘం మహిళా రాష్ట్ర కన్వీనర్‌ వంకాయలపాటి శివనాగరాణి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని, దానిలో భాగమే బడ్జెట్‌లో రూ.30 వేల కోట్ల కుదింపని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పనులకు రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఈ వేసవిలో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, అయినా పని ద్రేశాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, టెంట్లు వంటి కనీస సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు. ఉపాధి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా కేంద్రం పేదల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కార్పొరేట్లకు రూ.లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీకి అందిస్తున్నారని పేదలకు మాత్రం మొండి చేయి చూపుతున్నారని విమర్శించారు. ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కూలీలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. అప్పారావు మాట్లాడుతూ జిల్లాలో గతేడాది చేసిన పనికి రూ.1.69 కోట్లు రావాల్సి ఉందని, వీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమ్మర్‌ అలవెన్స్‌ పునరుద్దించాలని, పలుగు, పారా, తట్టా, తాగునీటికి డబ్బులు చెల్లించాలని, మెడికల్‌ కిట్టు, పే స్లిప్పులు మంజూరు చేయాలని, పని చేసే ప్రతి గ్రూపునకు పనిముట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం స్పందనలో జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు, బి.కోటేశ్వరి, నాయకులు అజరు, శివయ్య, భద్రయ్య రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి కె.అజరుకుమార్‌, నాయకులు భాస్కరరావు, సిఐటియు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.లక్ష్మీనారాయణ, వై.నేతాజీ, నాయకులు కాకుమాను నాగేశ్వరరావు పాల్గొన్నారు.