ప్రజాశక్తి-కొత్తపట్నం: ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులు కూలీలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు అన్నారు. గురువారం కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న ప్రాంతంలో ఆయన పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పుల ఫలితంగా తమకు తీవ్రమైన నష్టం జరుగుతోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. గతంలో గ్రూపుల వారీగా పని కొలతలు ఉండేదని, గ్రూపుల వారీగా మస్టర్ వేసుకునే వాళ్లని, దాని ఫలితంగా ఎంత పని చేస్తే అంత వేతనం వచ్చేదని కూలీలు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో పనిచేసిన అందరికీ కలిపి కొలత తీసుకోవడం, గ్రూపుల వారీగా పని కేటాయింపు కాకుండా వర్క్ ఐడి వారీగా కొలతలు తీసుకోవడంతో పనిచేసిన వాళ్లకు, చేయని వాళ్లకు తేడా కనిపించడం లేదని అన్నారు. గతంలో మస్టర్ షీట్లు తెలుగులోనే పేర్లు ఉండేవని, వాటిని ప్రస్తుతం ఇంటిపేరు లేకుండా వ్యక్తి పేరు ఇంగ్లీషులో ఇస్తున్నందున కూలీలు ఇంగ్లీషుని చదవలేక, ఇంటి పేరు లేనందున మస్టర్ ఎవరికి వేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తక్షణమే మస్టర్ షీట్లు తెలుగులో ఇవ్వాలని, గ్రూపుల వారీగా పని కొలతలు, వేతనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో వేసవికాలంలో సమ్మర్ అలవెన్స్ ఇచ్చేవారని, మంచినీళ్లకు, పలుగు, పార, తట్టకు పారితోషికం ఉండేదని తెలిపారు. కూలీలను సమీకరించి కొలతలు తీసుకుని మస్టర్లు వేసి రకరకాల పనులు చేసినందుకు మేస్త్రీలకు పారితోషకం ఉండేదని, ప్రస్తుతం అవన్నీ రద్దు చేయడం అన్యాయమని అన్నారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం కనీస వేతనం రూ.272 కాగా రూ.200కు మించి రావట్లేదని, ఆ వేతనంతో ఎలా బ్రతకాలని ఆయన ప్రశ్నించారు. మూడు నాలుగు కిలోమీటర్ల దూరం నడిచి 40 డిగ్రీల ఎండలో పనిచేస్తున్న కూలీలకు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం వైపు నుంచి నష్టపరిహారం అందించట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పోరాటాల ఫలితంగా ఉపాధి హామీ చట్టం వచ్చిందని, ఇలాంటి సమస్యల మీద సంఘటితంగా ఉద్యమించటం ద్వారానే న్యాయం జరుగుతుందనిఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ మేస్త్రులు మిట్నసాల జయరావు, దర్శిగుంట మోహన్‌రావు, గేరా ఆంజనేయులు, మేడికొండ పొట్టియ్య, లకంతోటి కృపారావు, గండికోట వెంకయ్య, ధర్నాసి కృపారావు, ఎల్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.










