ప్రజాశక్తి-ఎటపాక
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపులు తగ్గించడం ద్వారా దానిని నిర్వీర్యం చేసి పేదల ఉపాధిని దెబ్బ తీస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం, సిపిఐ చేపట్టిన ప్రచార భేరిలో భాగంగా మండలంలోని కెఎన్.పురం, గోళ్ళగట్ట గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో సీతారాం పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పని ప్రదేశాలకు వెళ్ళి కూలీలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి 200 పని దినాలు కల్పించాలని, రోజు కూలి రూ.600 ఇవ్వాలని, సమ్మర్ అలవెన్సులు పెంచాలని, వేతనాలు పెండింగ్ లేకుండా చూడాలని, పని ప్రదేశాల్లో టెంట్‌లు, మెడికల్ కిట్‌లు, మంచి నీరు, మజ్జిగ వంటి సౌకర్యాలు కల్పించాలని, పార, తట్ట, గునపం వంటి వస్తువులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను ధారాదత్తం చేస్తుందన్నారు. కులాలు, మతాల పేర్లతో పేదలను చీలుస్తున్న ప్రభుత్వాల కుట్రలను అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఐవి, నాయకులు ఆకిశెట్టి రాము, ఐ.పద్మ, జి.హరి, సీసం అర్జున్, పూనెం కన్నయ్య, పెనుబల్లి రాముడు పాల్గొన్నారు.
రెండో రోజు ప్రచార భేరి
విఆర్.పురం : మోడీని గద్దె దించుదాం.. దేశానికి కాపాడుదాం నినాదంలో చేపట్టిన ప్రచార భేరి కార్యక్రమంలో భాగంగా సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు ఆధ్వర్యాన రెండో రోజు చిన్నమట్టపల్లిలో కారం శివమయ్య స్థూపానికి పూలమాలవేసి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర చిన్న మట్టపల్లి నుండి సున్నవారిగూడెం మీదుగా కన్నాయిగూడెం వరకు సాగింది. ప్రతి ఇంటికి కరపత్రం పంచుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రచార భేరి ముందుకు సాగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ హయాంలో అధిక ధరలు, నిరుద్యోగం, ప్రైవేటీకరణ, జిఎస్‌టి భారాలు ఎలా అన్నింటిలోనూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నా వైసిపి ప్రభుత్వం కనీసం మాట్లాడటం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు త్యాగం చేసిన నిర్వాసితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు వడ్లాది రమేష్, అచ్యుత రావు, కారం కృష్ణమూర్తి, దేవయ్య, నరసింహమూర్తి, చందర్రావు పాల్గొన్నారు.
వారపు సంతలో ర్యాలీ
ముంచింగిపుట్టు : మండల కేంద్రంలో సిపిఎం, సిపిఐ ప్రచార బేరిని శనివారం నిర్వహించారు. వారపు సంతలో చేపట్టిన ర్యాలీలో నాయకులు మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక, నిరంకుశ బిజెపిని సాగనంపాలన్నారు. ప్రత్యేక హౌదా, పోలవరం, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి వంటి హామిలను బిజెపి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.స్టీల్ ప్లాంట్ ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, లక్ష్మీపురం సర్పంచ్ త్రినాధ్, ఎంఎం శ్రీను, భీమరాజు, నరసయ్య, డోంబ్రు, నారాయణ, జీనబంధు, వరహాలు, శ్రీను పాల్గొన్నారు.










