May 12,2023 23:52

ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న సిఐటియు నాయకులు శ్రీనివాసరావు

ప్రజాశక్తి- కె.కోటపాడు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని కుదించుటకు కుట్ర చేస్తుందని ఎపి రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయిని బాబు అన్నారు. అందుకే పథకానికి ప్రతి ఏటా మోడీ ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తూ వస్తుందని తెలిపారు. ఈ కుట్రను ఉపాధి హామీ కూలీలందరూ కలసికట్టుగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో శుక్రవారం ఉపాధి కూలీలతో ఆయన సమావేశమై మాట్లాడారు. వంట గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో కూలీలకు వచ్చిన ఆదాయం చాలక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలీలకు రోజు కూలి రూ.600 ఇవ్వాలని, సంవత్సరానికి 200 పని దినాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పని జరిగిన 15 రోజుల్లో పేమెంట్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల మండల కన్వీనర్‌ ఎర్ర దేవుడు, ఉపాధి మెట్లు, కూలీలు పాల్గొన్నారు.
ఉపాధి హామీ కూలి రేట్లు, పని దినాలు పెంచాలి
కసింకోట : ఉపాధి హామీ చట్టం కింద పనులు చేస్తున్న కూలీలకు కూలిరేట్లు, పని దినాలు పెంచాలని సిఐటియు జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు, ఎం.శ్రీదేవి, కె.శ్రీరామ్మూర్తి డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సిఐటియు నాయకులు శుక్రవారం సందర్శించి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చర్యలు ప్రయత్నాలు మానుకోవాలని, దీనికి బడ్జెట్లో నిధులు పెంచాలని కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల పని ప్రదేశంలో ఒక ఆరోగ్య కార్యకర్తను నియమించాలని, మజ్జిగ మంచినీటి, టెంట్లు వంటి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వేసవి అలవెన్స్‌, పనిముట్లకు డబ్బులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పి.మంగ, జి.అమ్మాజమ్మ, లక్ష్మి, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.