Dec 06,2022 22:39

ముసునూరు సోషల్‌ ఆడిట్‌లో వెలుగులోకి అక్రమాలు - ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌
ప్రజాశక్తి - ముసునూరు

            చనిపోయిన వ్యక్తి ఉపాధి హామీ పనులు చేయడం, మొక్కలు నాటకుండా రికార్డుల్లో మాత్రమే చూపడం, మస్తరు వేయకుండా నగదు ఖాతాల్లో జమచేయడం వంటి అవకతవకలు మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఉపాధి హామీ పనుల సోషల్‌ ఆడిట్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చట్టం పారదర్శకతకు మాయని మచ్చగా నిలిచింది. మంగళవారం ముసునూరులోని ఉపాధి హామీ కార్యాలయం వద్ద సామాజిక తనిఖీని డ్వామా పీడీ డి.రాంబాబు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అధికారి పరవేక్షణ లోపం వల్ల గోపవరంలో చనిపోయిన వ్యక్తులు ఉపాధి పనికి వచ్చిన్నట్లు వేలి ముద్రలుండటం, ఒకే ఇంటిలో ఒకే రేషన్‌కార్డులో ఇద్దరికి వేర్వేరు జాబ్‌ కార్డులు ఉండటం గుర్తించారు. ఈ క్రమంలో అక్కడి ఫిల్డ్‌ అసిస్టెంట్‌తో పాటు ఉపాధి మేట్‌ను కూడా సస్పెండ్‌ చేశారు. అలాగే మస్తరులో పని దినాలు తక్కువగా ఉండటం, వారి ఖాతాల్లో ఎక్కువ నగదు జమ చేయడం, కొన్ని గ్రామాల్లో పని ఒక చోట చూపి, వేరే చోట పనిచేయించడం, తక్కువ పని చూపి ఎక్కువ పని ఉన్నచోటకు మార్చి ఎక్కువ ఎస్టిమేట్‌ వేసినట్లు కాట్రేనిపాడులో గుర్తించారు. కొన్ని గ్రామాల్లో నిమ్మ, జామ, మామిడి మొక్కలు రికార్డులో మాత్రమే ఉన్నట్లు చూపడం, పోలంలో మొక్కలు లేకపోవడాన్ని కూడా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో రికవరీ విషయంలో రూ.2,34,575 జమ చేయాలని ఉపాధి హామీ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్టేట్‌ రిసోర్సుపర్సన్‌ టి.వెంకటేశ్వరరావు, జిల్లా విజిలెన్సు అధికారి ఎవి.విజయలక్ష్మి, ఎంపిడిఒ బసవరాజు అచ్యుత సత్యనారాయణ, ఎపిఒ జయప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.