
ప్రజాశక్తి - పరవాడ
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని కోరుతూ స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద బుధవారం సిఐటియు ఆధ్వర్యాన ఉపాధి హామీ కూలీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉపాధి పథకానికి బడ్జెట్లో ఈ సంవత్సరం రూ.60 లక్షల కోట్లకు కేటాయింపులు తగ్గించిందని, దీంతో కూలీలకు శ్రమ తగ్గ వేతనం అందడం లేదని, పని దినాలు తగ్గుతున్నాయని తెలిపారు. రెండు పూటలా పనులు చేయించడం, ఫొటోలు, ఫేస్ యాప్ వంటి నిబంధనలు పెట్టి కూలీలను పనికి దూరం చేస్తున్నారని విమర్శించారు. గతంలో పనిముట్లకు అదనంగా డబ్బులు, వేసవి అలవెన్స్ ఇచ్చేవారని, వాటిని ఇప్పుడు తీసివేశారని తెలిపారు. ఈ పథకానికి లక్ష కోట్లు బడ్జెట్ పెంచి కోరిన అందరికీ జాబ్ కార్డులు మంజూరు చేయాలని, కొలతలతో సంబంధం లేకుండా రోజుకు కనీస కూలి రూ.600 ఇవ్వాలని, 200 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో మంచినీరు, మెడికల్ కిట్లు, టెంట్ వంటి సౌకర్యాలు కల్పించాలని, సమ్మర్ అలవెన్స్‌లు, పనిముట్లకు డబ్బులు ఇవ్వాలని, ప్రమాద బీమా కల్పించాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో వినతిపత్రాన్ని ఎంపీడీవో వి.వేమ సుందరరావుకు అందజేశారు. దీనికి స్పందించిన ఆయన పని ప్రదేశంలో మెడికల్ కిట్లు ఏర్పాటు చేస్తామని, ఇతర డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కార్మిక సంఘం నాయకులు సిహెచ్ వెంకటలక్ష్మి, పి.భవాని, రెడ్డి ముత్యాలమ్మ, ఆర్ కొండమ్మ, పి పార్వతి, పి జయ భారతి, ఎం పద్మ, ఏ పుష్ప, ఆర్ కళ్యాణి, బి వెంకటలక్ష్మి, వి నాగమణి, ఎస్ కుమారి, వెన్నెల పాలెం, భరిణికం, గొర్లివానిపాలెం, పరవాడ, గ్రామాలకు చెందిన ఉపాధి కూలీలు పాల్గొన్నారు.