ప్రజాశక్తి -ఆనందపురం : మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా 2022-23 సంవత్సరంలో జరిగిన పనులపై 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఉపాధి హామీ, పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, సోషల్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్లకు సంబంధించి 1335 పనులకు గాను వేతన రూపంలో రూ.13.18 కోట్లు, సామాగ్రి రూపంలో రూ..1.86 కోట్లు మొత్తం రూ.15.04 కోట్ల ఖర్చు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీలో అన్ని గ్రామ పంచాయతీల పరిధిలోని మస్తర్లలో దిద్దుబాట్లు ఉన్నట్లు గుర్తించారు. బిపి.కల్లాలు, గండిగుండం గ్రామ పంచాయతీలలో పని ప్రదేశంలో సమాచార బోర్డు నిర్మించాలని సూచించారు. హౌసింగ్‌కు సంబంధించి 90 రోజులకు ఎమ్.బుక్స్ రికార్డు చేయాలని సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు ప్రోజెక్ట్ డైరెక్టరు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ ఇ.సందీప్, అదనపు పీడీ ఆంజనేయులు, అసిస్టెంట్ పీడీ రోజా రాణి, జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ నిర్మలాదేవి, అంబుడ్సుమెన్ దొరబాబు, మండల హౌసింగ్, పంచాయతీరాజ్ ఎఇలు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.










