ప్రజాశక్తి-సంతమాగులూరు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని డ్వామా పీడీ వై శంకర్ నాయక్ తెలిపారు. మంగళవారం ఉపాధి హామీ కార్యాలయం ఆవరణలో 2021 సంవత్సరం నుంచి 2022 మార్చి నెలాఖరు వరకు జరిగిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీలో గుర్తించిన అంశాలపై ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్‌నాయక్ మాట్లాడుతూ, కొత్తగా ఫేక్ హాజరుకు చెక్ పడేలా చర్యలు చేపట్టామన్నారు. గతంలో ఉపాధి హామీ కూలీల హాజరు మస్టర్లలో నమోదు చేసే వారన్నారు. దీనివల్ల ఒకరికి బదులు మరొకరు పనికి హాజరు కావడం, ఒకరే రెండుసార్లు సంతకాలు చేయడం వల్ల ఫేక్ హాజరుతో ప్రభుత్వ సొమ్ముకు గండి పడుతుందన్నారు. దీనిని అరికట్టడానికి ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేసి సియుజి సిమ్ కార్డులను అందజేస్తామన్నారు. అంతేగాక రోజుకి రెండుసార్లు ఫొటోలు అప్లోడ్ చేసి ఉపాధి హామీ కూలీల హాజరును పారిదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఉపాధి హామీ నిధులతో, రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన మొక్కలు 50 శాతం చనిపోయాయన్నారు. ఉపాధి హామీ పనులను ఆయా గ్రామ సర్పంచి, పంచాయతీ కార్యదర్శి ప్రత్యక్షంగా పర్యవేక్షించాలన్నారు. 13 కోట్ల రూపాయల ఖర్చుకు గాను, సిబ్బంది వేతనాలకు రూ.8 కోట్ల 48 లక్షలు, మెటీరియల్‌కు రూ.4 కోట్ల 56 లక్షలు చెల్లించామన్నారు. 20 గ్రామ పంచాయతీలలో రూ.4 లక్షల 36 వేలు పని దినాలు కల్పించామన్నారు. సామాజిక తనిఖీ ప్రజావేదికలో మామిళ్లపల్లి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ పనులకు రానివారికి మస్టర్లు వేయడంతో అతని నుంచి 6 వేల రూపాయలు రికవరీకి సిఫార్సు చేశామన్నారు. అలాగే సిమెంట్ అవకతవకలు సంబంధించి పంచాయతీరాజ్ ఏఈకి షోకాజ్ నోటీస్ జారీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డివిఓ శోభన్‌బాబు, ఏపీడిఎస్ రాజేష్, ఎంపీడీవో ఎం సాంబశివరావు, ఏపీవో బాలకృష్ణ నాయక్, జడ్పిటిసి అడవి శ్రీనివాసరావు, ఎస్‌ఆర్ పి చిన్నబ్బాయి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు గురుయాదవ్, పలువురు సర్పంచులు పాల్గొన్నారు.










