ప్రజాశక్తి-రావికమతం :ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని అనకాపల్లి క్లస్టర్ ఎపిడి మణికుమార్ కోరారు. స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి గ్రామంలోనూ పనులు త్వరిత గతిన ప్రారంభం కావాలన్నారు. పండుగలు, వ్యవసాయ పనులు పూర్తవడంతో ప్రజలందరూ ఖాళీగా ఉన్నందున వారందరికీ ఉపాధి కల్పించవలసిన బాధ్యత ఉందని ఆయన తెలిపారు. మట్టి రోడ్లు, పంట కాలవలు, శ్మశానాల అభివృద్ధి, కాలువల పూడికతీత, పండ్ల తోటల పెంపకం 450 పనులుకు గాను మండలానికి రూ.17 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి, రైతాంగానికి, సమాజానికి ఉపయోగపడే పనులు గుర్తించి వాటిని చేపట్టాలని సూచించారు.జాబు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పనికి కల్పించాలని, అవసరమైతే ప్రతి ఇంటికి వెళ్లి పనికి రావాలని కోరాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన వేతన కూలి రూ.257 తక్కువ కాకుండా పని కల్పించాలని ఆయన తెలిపారు. రూ. 257లు ఒక మనిషికి రావాలంటే ఎంత పని చేయించాలన్నది సిబ్బందికి వివరించారు. తాను ప్రతి గ్రామంలో పర్యటిస్తానని, మండలానికి, జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా అందరూ కష్టపడి పని చేయాలని ఆయన సూచించారు. ప్రజల ఏ ఒక్కరూ గ్రామం నుంచి వలస వెళ్లే పరిస్థితి రాకుండా పని కల్పించాలన్నారు. విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించినా వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని పనులను వేగవంతం చేయాలన్నారు. అనంతరం మరుపాక పంచాయతీ మరుపాక, దాసరయ్యపాలెం, గొల్లలపాలెం తదితర గ్రామాల్లో పర్యటించి ఉపాధి కూలీలతో సమావేశ మయ్యారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ కాశి, ఈసీ కామేష్, టీఏలు మోహన్, రమణ పలువురు పాల్గొన్నారు.










