Jul 01,2023 00:39

ఎంపిడిఒ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కూలీలు

ప్రజాశక్తి-అచ్యుతాపురం
మండలంలోని ఎర్రవరం గ్రామంలో ఉపాధి హామీ పనులను పునరుద్ధరించాలని కోరుతూ స్థానిక ఎంపిడిఒ కార్యాలయం ఎదుట కూలీలు ధర్నా నిర్వహించారు. ఎంపీడీవో విజయలక్ష్మికి వినతి పత్రాన్ని అందజేశారు. వీరికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌ రాము మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ విఆర్‌పి అవకతవకలకు పాల్పడితే ఉపాధి కూలీలకు పనులు నిలిపివేయడం సరైన కారణం కాదని పేర్కొన్నారు. ఉపాధి పనులతోనే కూలీలు జీవనం సాగిస్తున్నారని, వెంటనే పనులు కల్పించి కూలీలకు న్యాయం చేయాలని రాము డిమాండ్‌ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి నిలుపుదల చేసిన ఉపాధి పనులను వెంటనే ప్రారంభించాలని, గత ఆరువారాలుగా చేసిన పనులకు వెంటనే వేతనాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కె.సోమునాయుడు, ఉపాధి కూలీలు అప్పల నరసింహ, సింహాద్రి, లక్ష్మి, వరలమ్మ, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.