ప్రభుత్వ ఉద్యోగులకు, చనిపోయిన వారికీ పేమెంట్లు
డ్వామా పీడీ ఆగ్రహం
డిఆర్‌పిలపై చర్యలకు సిఫార్సు
ప్రజాశక్తి - పెదవేగి
గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఉపాధి కల్పనకు, వలసలను నివారించేందుకు ఉన్న ఊరిలోనే వంద రోజులు పని కల్పించేలా మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పనుల్లో అవినీతి, అక్రమాలు పరాకాష్టకు చేరాయి. అధికారమే అండగా అందినకాడికి దోచుకుంటున్నారు. పేదల పేరు చెప్పుకుని ఈ పథకంలో చేసే అవినీతి అంతా ఇంతాకాదు. ఆఖరుకి చనిపోయిన వారి పేరు మీద, ప్రభుత్వ ఉద్యోగులకు పేమెంట్లు చేశారంటే ఏ రీతిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. బుధవారం పెదవేగి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద కరువు పనులపై నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజా వేదిక ఇందుకు నిదర్శనం. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ రాంబాబు ఆడిట్ నివేదికలను డిఆర్‌పిలతో వివరాలను విచారించారు. ఆడిట్ నివేదికల ప్రకారం వాస్తవానికి, నివేదికలకు ఉన్న తేడాలు గమనించి పీడీ ఖంగుతిన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను నమ్మి కోట్ల రూపాయల విలువైన పనులను అప్పగిస్తే ఎందుకు అవకతవకలు జరిగాయని నిలదీశారు. చక్రాయిగూడెంలో ఆశావర్కర్, లైన్‌మెన్, వాలంటీర్లు కూడా పనులు చేసినట్లు మస్తర్ వేసి ఏవిధంగా పేమెంట్లు చేశారని ప్రశ్నించారు. డబల్ జాబ్ కార్డులు ఈ గ్రామంలో ఎక్కువగా ఉన్నాయని, వాటిని తొలగించే బాధ్యత ఎంపిడిఒ, ఎపిఒలదేనని అన్నారు. డబల్ జాబ్ కార్డులు డిలేట్ చేయాలని ఎపిఒ హేమలతను ఆదేశించారు. మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వ ఉద్యోగులకు పేమెంట్లు ఇచ్చి విచారణలో తమకు తెలియక చేశామంటే, వారిని ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఎలా కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళ్లగోకవరం, బాపిరాజుగూడెం, అంకన్నగూడెం, అమ్మపాలెంలో ఉపాధి పనుల్లో జరిగిన అవకతవకలపై రైతులు సైతం ఫిర్యాదులు చేయటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. విజయరాయి గ్రామంలో దుక్కిపాటి ప్రసాద్ అనే వ్యక్తి చనిపోయినా కరువు పని చేసినట్లు మస్తర్ వేసి పేమెంట్ చేయటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవకతవకలకు పాల్పడిన డిఆర్‌పిలపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, జాబ్ కార్డు ఉన్నవారు, పలు గ్రామాల ప్రజలు పీడికి ఫిర్యాదులు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ, ఎపిఒ, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.










