Nov 08,2023 00:16

మాట్లాడుతున్న ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ డిప్యూటీ కమిషనర్‌ మల్లికార్జునరావు

ప్రజాశక్తి- సబ్బవరం
ఉపాధి హామీ పథకం పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ కమిషనర్‌ డివి మల్లికార్జున ఆదేశించారు. మండలంలోని నల్లరేగులపల్లి, నారపాడు పంచాయితీల్లో రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏరియాలో మినీ పర్కులేషన్‌ టాంక్‌, ఫారంపొండ్‌, బౌండ్రి ట్రెంచ్‌ పనులు, కొండలను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఉపాధి హామీ పథకం ద్వారా పనుల గుర్తింపు కోసం ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది చెరువు పనులు, కాలువ పనులు కాకుండా మిగతా పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అనకాపల్లి, యలమంచిలి, చోడవరం, పెందుర్తి క్లస్టర్ల ఏపిడిలు మణికుమార్‌, శ్రీనివాస్‌ కుమార్‌, డి.శ్రీనివాస్‌, ఆంజనేయులు, సబ్బవరం, కె.కోటపాడు మండల ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఎంపీడీవో రమేష్‌ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీఓలు మళ్ల శ్రీనివాసరావు, అప్పలరాజు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు పరమేష్‌, రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.
100 రోజులు పని కల్పించాలి
అనకాపల్లి : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ ఎస్టీలకు కనీసం వంద రోజులు పని కల్పించాలని పథకం డిప్యూటీ కమిషనర్‌ మల్లికార్జున రావు ఆదేశించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఉపాధి హమీ పథకంపై 2024- 25 ప్లానింగ్‌, కొత్త పనుల గుర్తింపు, లేబర్‌ బడ్జెట్‌పై సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది చెరువులు, ఛానల్‌ పూడికతీత పనులు తాత్కాలికంగా నిలిపిచేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల ఎపిఓలు, ఐసిలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, అనకాపల్లి, యలమంచిలి, మాడుగుల క్లస్టర్ల ఎపిడిలు జి.మణికుమార్‌, బి.శ్రీనివాస కుమార్‌, శ్రీనివాస్‌, అనకాపల్లి ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.