Dec 03,2022 23:59

మాట్లాడుతున్న సిపిఎం మండల కార్యదర్శి సీరం సురేష్‌

ప్రజాశక్తి-చింతూరు
ఏడాదికాలంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పెండింగ్‌ బిల్లులను తక్షణం విడుదల చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్‌ డిమాండ్‌ చేశారు. శనివారం చదలవాడ గ్రామ సచివాలయం పరిధిలో కలుముల మల్లేష్‌ జరిగిన సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. పని చేసిన 15 రోజులలోనే కూలీ డబ్బులు ఇవ్వాలని చట్టం చెబుతుంటే, ఏడాది కాలంగా బిల్లుల పెండింగ్‌ పేరుతో లక్షల రూపాయలను విడుదల చేయకపోవడం దారుణమన్నారు. సచివాలయం పరిధిలో కనీస సౌకర్యాలైన వీధిలైట్లు, మంచినీళ్లు, రోడ్లు అనేక సమస్యలు, పేరుకుని పోయి ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరారు. సచివాలయం పరిధిలో లక్కవరం నుండి కాన్సలురుకు రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరారు. మంచినీటి స్కీములు నిర్మాణంలో ఉన్నాయని, ప్రజలకు కనీసం చుక్క నీరు అందించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు పల్లపు వెంకట్‌, మడకం చిన్నయ్య, కలుముల ముత్తయ్య, వేముల లక్ష్మయ్య, సవలం భద్రయ్య, ధర్మల తమ్మయ్య, మీడియం భద్రయ్య, కలముల రామారావు, సత్తిబాబు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.